భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - May 04 , 2026 | 12:33 AM
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
వేములవాడ, మే 3 (ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజులు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారు జామున కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్రస్నానాలను ఆచరించారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు క్యూలైన్‌లో సుమారుగా మూడు గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, బ్రేక్ దర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన గాయత్రిమాత, బద్ది పోచమ్మ, శ్రీనగరేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భీమన్నను దర్శించుకున్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి..
వేములవాడ భీమేశ్వర స్వామిని శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. భీమన్న ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొని తరించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
రాజన్న ఆలయ అభివృద్దికి రూ.లక్ష విరాళం..
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు విరాళాన్ని అందజేసి తమ భక్తిని చాటుకున్నారు. భీమన్న ఆలయానికి విచ్చేసిన సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడుపల్లికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్-నళిని దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రొటోకాల్ ఏఈవో అశోక్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మకు రూ.లక్ష నగదును అప్పగించగా రశీదు అందజేశారు.