Share News

ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:59 PM

అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని, రాజరాజేశ్వర దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రతి పనికి గడువు నిర్ణయించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

సిరిసిల్ల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని, రాజరాజేశ్వర దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రతి పనికి గడువు నిర్ణయించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీటీఏడీఏ) పనులపై దేవాదాయ శాఖ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, ఎన్పీడీసీఎల్‌, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాజరాజేశ్వర ఆలయానికి చెందిన నూతన గోశాల స్థలం కేటాయింపు, మిగతా పనుల పురోగతిని రెవెన్యూ, పశు సంవర్ధక శాఖ అధికారులను అడిగితెలుసుకున్నారు. అనంతరం గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో తుది దశ పనులను త్వరగా చేయాలని సూచించారు. టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్‌, పర్యాటక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్‌ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 ఫీట్ల రహదారి విస్తరణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. రహదారి నిర్మాణం, ఇరువైపులా మురుగు కాలువ నిర్మాణం, ఇతర పనులను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, ఆర్‌ అండ్‌బీ ఈఈ నరసింహచారి, పర్యాటక శాఖ ఎస్‌ఈ సరిత, పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, టీపీవో అన్సారీ, ఆలయ ఈఈ రాజేష్‌, నీటి పారుదల ఈఈ దయాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేష్‌, ఎన్పీడీసీఎల్‌ అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:59 PM