Share News

అందరి సహకారంతో అభివృద్ధి

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:23 AM

కరీంనగర్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే తపనతో అహర్నిశలు కష్టపడుతుంటే... కొంత మంది తమ కాళ్లలో కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు.

అందరి సహకారంతో అభివృద్ధి

కరీంనగర్‌ అర్బన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే తపనతో అహర్నిశలు కష్టపడుతుంటే... కొంత మంది తమ కాళ్లలో కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... బీఆర్‌ఎస్‌ పాలనలో కరీంనగర్‌ అభివృద్ధికి కేంద్రం అనేక పనులకు నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో ఆ నిధులన్నీ మురిగిపోయి అభివృద్ధి ఆగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నంత కాలంలో డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరించలేకపోయిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమృత్‌ కింద 17 కోట్లు, యూసీఎఫ్‌ స్కీంలో భాగంగా 80 కోట్ల నిధులతో పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు. మొదటి విడతలో 17 కోట్లతో టెండర్‌ పనులను ప్రారంభిస్తే... లేనిపోని వివాదాలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ వద్ద కమీషన్‌ పొందేందుకు ప్రయత్నించినవారే టెండర్‌ ప్రక్రియకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. టెండర్‌ పనుల విషయంలో నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలన్నారు. గతంలో కరీంనగర్‌ మేయర్‌గా డి శంకర్‌ ఉన్న సమయంలో ప్రతి చోట డెంగ్యూ ఉందంటూ లేనిపోని వివాదాలు సృష్టించి, దుష్ప్రచారం చేసి కరీంనగర్‌ పేరును చెడగొట్టేందుకు యత్నించారన్నారు. దయచేసి చిల్లరగాళ్ల ట్రాప్‌లో పడొద్దని, తాం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు.

ఫ అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం..

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులతో కలిసి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. భీమదేవరపల్లిలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని తెలిపారు. జమ్మికుంట, హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అడుగుతున్నామన్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కరీంనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరామని అన్నారు.మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులపై వచ్చిన ఆరోపణలపై విచారణతోపాటు పనులు జరుగుతున్నాయన్నారు. డంపింగ్‌ యార్డును తొలగించాల్సిందేనని, జనావాసాలకు దూరంగా పెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేష్‌, డిప్యూటీ మేయర్‌ వై సునీల్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ మల్లికార్జున రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, వైద్యుల అంజన్‌కుమార్‌, రాచకొండ చక్రాధర్‌రావు, అంజనీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫ రూ.4.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కరీంనగర్‌ టౌన్‌: నగరంలోని పలు డివిజన్లలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పర్యటించారు. 23, 25, 26, 46 డివిజన్లలో 4.5 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని 46వ డివిజన్‌ రాంనగర్‌ లో స్థానిక కార్పొరేటర్‌ మల్లిఖార్జున్‌ రాజేంధర్‌ తో కలిసిబాక్స్‌ టైపు డైన్రేజీ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 25, 26 డివిజన్ల పరిదిలో స్థానిక కార్పొరేటర్లు వైద్యుల అంజన్‌ కుమార్‌, గంట శ్రీనివాస్‌, సుభాష్‌నగర్‌లోని బుట్టి రాజారామ్‌ కాలనీ, ముదిరాజ్‌ కాలనీ,బైపాస్‌ రోడ్డు ప్రాంతాల్లో పైపు లైన్‌ డ్రైనేజీ లు, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. 23వ డివిజన్‌ సీతారాంపూర్‌రెడ్డి హాస్టల్‌ సమీపంలో స్థానిక కార్పొరేటర్‌ గుమ్మడి రాజ్‌కుమార్‌తో పైపులైన్‌ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమిపూజ చేశారు.

Updated Date - Nov 10 , 2026 | 12:23 AM