ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:29 AM
శృంగేరి పీఠాధిపతి సూచనలు ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు ముందుకు సాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
వేములవాడ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): శృంగేరి పీఠాధిపతి సూచనలు ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు ముందుకు సాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను శనివారం రోజున దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, సాకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బద్ది పోచమ్మ ఆలయం వద్ద మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఒక్కో పనికి ఒక్కో గడువు పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఇతర మంత్రుల సహకారంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం అనిమిటి మండపంలో భాగంగా అద్దాల మండపం, బ్రహ్మణ సత్రం, నిత్య అన్నదాన సత్రం, ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయని, వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా రాజన్న ఆలయ విస్తరణ చేపడుతున్నామని, త్వరలో పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన దర్శనం కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా రూ. 20 కోట్లతో బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నాంపల్లి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, అందులో భాగంగా ఇప్పటికే నాంపల్లి గుట్టపైకి విమానం చేరుకుందని వివరించారు. రానున్న రోజుల్లో నాంపల్లి గుట్టను పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సకల సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశ్యంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాజన్న అంతరాలయం అలాగే ఉంటుందని, ఆలయాన్ని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అభివృద్ధి చేస్తున్నామని, శిలలతో నిర్మాణం ఉటుందని తెలిపారు.
మరో రూ. 100 కోట్లకు ప్రతిపాదనలు పంపించాం..
- దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఆలయాభివృద్ధి ఇప్పటికే రూ. 150 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో రూ. 100 కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రాజన్న ఆలయ, బద్ది పోచమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించామని అన్నారు. వచ్చే సంవత్సరం ఆలయ విస్తరణ పనులు పూర్తి చేసి భక్తులకు రాజన్న దర్శనం కలిగేలా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో కే.ఎస్.బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు ఉన్నారు.