Share News

అమృత్‌ ఆలస్యం

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:52 AM

పట్టణాల రూపురేఖలు మార్చి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2.0 పథకం కింద ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది

  అమృత్‌ ఆలస్యం

- కోట్ల నిధులున్నా కొరవడిన పురోగతి

- గడువు దాటినా గాడిన పడని పరిస్థితి

- నింపాదిగా పట్టణాల్లో తాగునీటి వ్యవస్థ

ఇదీ.. కరీంనగర్‌లోని బైపాస్‌ వద్ద నిర్మిస్తున్న అతిపెద్ద ఓవర్‌హెడ్‌ నీటి ట్యాంక్‌. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ప్రస్తుతం 86 ఎంఎల్‌డీల తాగునీటిని అందించే ఫిల్టర్‌బెడ్‌లు, సరఫరా వ్యవస్థ ఉంది. దీనికి అదనంగా మరో 10 ఎంఎల్‌డీ తాగునీటిని విలీన గ్రామాలకు అందించాలనే ఉద్ధేశ్యంతో అమృత్‌ 2.0 ద్వారా రూ.145.5కోట్ల వ్యయంతో ఈ పెద్ద ట్యాంక్‌తో పాటు ఒక నూతన ఫిల్టర్‌బెడ్‌, సంప్‌హౌజ్‌, ఇతర చిన్న ట్యాంక్‌లు, డిస్ర్టిబ్యూషన్‌ లైన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పనులు నింపాదిగా నడుస్తున్నాయి. ఇంకా 50శాతానికిపైగా పనులు పూర్తయితేనే కార్పొరేషన్‌లో కలిసిన విలీన గ్రామాలకు తాగునీరు అందే పరిస్థితి ఉంటుంది. కానీ పలుచోట్ల రోడ్ల పక్కనే పైపులు వృధాగా పడి ఉన్నాయి.

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

పట్టణాల రూపురేఖలు మార్చి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2.0 పథకం కింద ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆశయంతో పలు పనులను కరీంనగర్‌, రామగుండం కార్పొరేషన్‌తో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లో చేపడుతోంది. దాదాపుగా ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన పనులు చాలా చోట్ల నత్తనడకన నడుస్తున్నాయి. కీలకమైన అవసరాలను తీర్చాల ని పలు ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకున్నా.. క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. గడువులు దాటుతున్నా పనులు పూర్తికావడం లేదు. కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుండగా ఇంకొన్ని చోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రజలకు ఈ వేసవి నాటికి దాహార్తి తీరేందుకు అమృత్‌ పనులు ఉపయుక్తంగా మారే పరిస్థితి కనిపించడం లేదు.

పనులు మంజూరైన తీరు..

--------------------------------

పట్టణం పనులు రూ.కోట్లు

--------------------------------

కరీంనగర్‌ 6 257.55

రామగుండం 3 257.16

సిరిసిల్ల 2 105.57

జగిత్యాల 3 44.89

కోరుట్ల 2 44.64

చొప్పదండి 2 39.44

జమ్మికుంట 2 36.14

పెద్దపల్లి 2 28.74

ధర్మపురి 2 26.14

మెట్‌పల్లి 2 22.54

సుల్తానాబాద్‌ 2 21.54

హుజూరాబాద్‌ 2 19.39

రాయికల్‌ 2 18.34

మంథని 2 14.08

--------------------------------

936.16 కోట్ల వ్యయంతో...

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో ప్రస్తుతమున్న తాగునీటి వ్యవస్థను మెరుగు పర్చడానికి అమృత్‌ 2.0 ( అటల్‌ మిషన్‌ ఫర్‌ రీజువెనేషన్‌ ఆండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) ద్వారా పట్టణాల్లోని మౌలిక సదుపాయల అభివృద్ధి, ప్రతి ఇంటికి తాగునీరు అందించే పైప్‌లైన్‌ వ్యవస్థ, నీటి వనరుల పునరుద్ధరణ, మురుగు నీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ లాంటి పనులు ఎంపిక చేసుకుని ఈ నిధుల్ని కేంద్రం అందిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటునందిస్తోంది. మొత్తంగా 34 రకాల పనులు ఎంపిక చేయగా వీటి కోసం రూ.936.16కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో తాగునీటి సరఫరాకు సంబంధించి రామగుండం కార్పొరేషన్‌ మినహాయించి మిగతా అన్ని పట్టణాల్లో ఒక్కో ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగానే ట్యాంక్‌ల నిర్మాణంతో పాటు పైప్‌లైన్‌లు వేస్తున్నారు. అయితే ఈ పనుల్లో చాలా వరకు సబ్‌ కాంట్రాక్ట్‌లు ఉండటం వల్ల అనుకున్న వేగంగా పూర్తవడం లేదు. ఒక్కరే గుత్తేదారు ఐదారుచోట్ల పనుల్ని చేస్తుండటం వల్ల ఆలస్యం మరింతగా పెరుగుతోంది. ఈ ఏడాది జూలై నాటికి కొన్ని పనులు పూర్తవ్వాలి. ఇంకొన్ని ఈ డిసెంబర్‌లోపు అవ్వాలి. మొత్తంగా వచ్చే ఏడాది వేసవి నాటికల్లా ఈ పనులు పూర్తవ్వాల్సి ఉన్నా.. పనుల గడువును ఇంతకింతకు వాయిదా వేస్తున్నారు.

జరుగుతున్న పనులు :

- నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల

- ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ల నిర్మాణాలు

- గ్రౌండ్‌ లెవల్‌ సంపుల నిర్మాణాలు

- పాత పైప్‌లైన్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు

- అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు

- మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలు(ఎస్‌టీపీ)

- చెరువుల పునరుద్ధరణ, నీటివనరుల రక్షణ

- పార్కులు, పచ్చదనం అభివృద్ధికి ప్రాధాన్యం

ఇదీ నిర్మాణ ప్రగతి

- రామగుండంలో రూ.252.82కోట్లతో మూడు సీవరేజ్‌ప్లాంట్‌ల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని 32.50 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో మురుగు నీరును శుద్ధి చేసేందుకు వీటిని నిర్మిస్తున్నారు. వీటితోపాటు పట్టణ పరిధిలోని రెండు చెరువుల్ని రూ.4.34 కోట్లతో పునరుద్ధరిస్తున్నారు.

- జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోనూ రూ.3.14కోట్ల చొప్పున ప్రతి పట్టణంలో ఒక చెరువును పూర్తిగా మారుస్తున్నారు. ఇక్కడి చెరువుల్లోని నీటిని సంరక్షించడంతో పాటు శుద్ధి కోసం అవసరమైన పనుల్ని కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ పైప్‌లైన్‌ల నిర్మాణం కొనసాగుతుండగా వీటి వేగం పెరగాలి.

Updated Date - Nov 21 , 2026 | 12:52 AM