సత్ఫలితాలిస్తున్న డీఈఈటీ యాప్
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:46 AM
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (డిఇఇటి) యాప్ సత్పలితాలను ఇస్తున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (డిఇఇటి) యాప్ సత్పలితాలను ఇస్తున్నది. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిరుద్యోగుల అర్హతలకు తగిన ఉద్యోగాల ఖాళీల సమాచారం, వారి వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో అందుతుంది. దీంతో యువత బోగస్ కంపెనీలు, దళారులు, మోసగాళ్ల బారిన పడి నష్టపోకుండా ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఈ యాప్‌లో ఇప్పటి వరకు 194 కంపెనీలు, పరిశ్రమలు, సర్వీసు సెంటర్లు నమోదు చేసుకున్నాయి. జిల్లాలోని 5,113 మంది నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరాలను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 73 మంది హైరింగ్ ఉద్యోగాలను, ఆరుగురు శాశ్వత ఉద్యోగాలను పొందారు. ఉద్యోగావకాశాలు పొందడంలో, నిరుద్యోగుల వివరాలు నమోదు చేయడంలో జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు గ్రానైట్ ఇతర ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల వివరాలను ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యే విధంగా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
ఫ ఖాళీల సమాచారం:
ఈ యాప్ ద్వారా పరిశ్రమలు, కంపెనీలు, తదితర సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను నేరుగా నిరుద్యోగుల మొబైల్ ఫోన్లకు పంపిస్తారు. ఈ సమాచారంలో ఉద్యోగులకు అవసరమైన అర్హతలు, వేతన వివరాలు, ఖాళీల సంఖ్య, రాత పరీక్ష, ఇంటర్వ్యూల వివరాలు ఉంటాయి. దీంతో నిరుద్యోగులు ఆయా సంస్థలు నిర్వహించే పరీక్షలకు వెళ్లి ఉద్యోగాలు పొందుతున్నారు. నిరక్ష్యరాస్యుల నుంచి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారి వరకు ఎవరైనా ఈ యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఫ నమోదు ఇలా:
డీఈఈటి వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేది, మొబైల్ రంబరు, ఈ మెయిల్, విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వారు కోరుకునే ఉద్యోగం, పని చేయాలనుకునే ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశమున్నది. నమోదు పూర్తి చేసుకున్న వారి అర్హతలకు సరిపోయే ఉద్యోగాలు ఉన్నపుడు నోటిఫికేషన్ వస్తుంది.
ఫ సంస్థల నమోదుకు కృషి చేస్తున్నాం..
- వి సాల్మన్‌రాజు, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి
నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రైవేట్ రంగంలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సంస్థలనుడీఈఈటీ యాప్‌లో నమోదు చేయించేందుకు కృషి చేస్తున్నాం. ఈ యాప్ ద్వారా మోసపూరిత కంపెనీలు, పైరవీకారుల బారిన పడకుండా ఉద్యోగం పొందే అవకాశం నిరుద్యోగులకు కలుగుతుంది. ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి.