దసరా ధమాకా
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:24 AM
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా తీపి కబురు అం దించింది.
గోదావరిఖని, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా తీపి కబురు అం దించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటనతోపాటు కార్మికులకు 34శాతం వాటాను ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, కోల్‌బెల్ట్ ప్రాంత శాసన సభ్యులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మికులతో పాటు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రకటనలు చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు రూ.1754కోట్ల నికర లాభాలు వచ్చాయని, ఇందులో 34శాతం రూ.596కోట్లు కార్మికులకు లాభాల వాటా ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులు 38737మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,53,912 లాభాల వాటా రానున్నది. సింగరేణిలో పని చేస్తున్న 29717మంది కాంట్రాక్టు కార్మికులకు సైతం రూ.5500 బోనస్ ప్రకటించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి కార్మికుల, ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి సంస్థకు చెందిన మైనింగ్ ప్రభావం లేని భూములను గుర్తించి అక్కడ లే అవుట్‌లను సిద్ధం చేసి కార్మికులకు ఇండ్ల స్థలాలను అందించనున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ హౌజింగ్ కాలనీలుగా నామకరణం చేసి కార్యాచరణ రూపొందించనున్నారు. అంతే కాకుండా గతంలో సింగరేణి రెవెన్యూశాఖకు అప్పగించి 5774 ఎకరాల భూముల్లో 4500ఎకరాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. మిగిన 1250ఎకరాల్లో జీఓ నెం. 76ద్వారా అర్హులైన వారికి ఇండ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న 300మంది డిపెండెంట్లకు 15రోజుల్లోనే ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మారుపేర్లతో ఇబ్బంది పడుతున్న 170 కార్మిక వారసుల సమస్యను పరిష్కరించేందుకు సింగరేణికి ప్రభుత్వం సూచన చేసింది. మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ కోసం కార్మికులు ఇకపై కొత్తగూడెం వెళ్లాల్సిన అవసరం లేదని, ఏరియా ఆసుపత్రి పరిధిలోనే మెడికల్ బోర్డు సమావేశాలను నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చింది. మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పింది. కరోనా సమయంలో అధిక గైర్హాజర్లతో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సమస్యను పరిష్కరించేందకు వన్‌టైమ్ ఆప్షన్ కింద విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కార్మికులు, ఉద్యోగుల పెర్క్స్, అలవెన్సులపై పడుతున్న ఆదాయ పన్నును ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయం తీసుకొంది. సింగరేణి ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దేందుకు అత్యుత్తమ వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. సింగరేణి అధికారుల పీఆర్‌పీని చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్, ఇతర ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. రామగుండం ప్రాంతంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని, సత్తుపల్లి, భూపాలపల్లి నియోజకవ ర్గాల్లో జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
సింగరేణి లాభాలు తగ్గింది ఇందుకే...
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తబ్లాకులను అదనంగా సాధించడంలో విఫలం కావడం వల్ల సింగరేణికి ఈ ఏడు లాభాలు తగ్గాయని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 141 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం వినియోగించుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు ఉన్న బొగ్గు బ్లాకులలో కొన్ని మూతపడడంతో ఉత్పత్తి, ఆదాయంపై ప్రభావం పడిందని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం కొత్త బ్లాకుల సాధనకు చర్యలు తీసుకున్నదని, ఫలితంగానే తాడిచర్ల-2, కోయగూడెం బ్లాక్-3, మణుగూరు, పీకే ఓసీపీ-2 డీప్ సైడ్ బ్లాక్, నైని బ్లాక్‌ల సాధనతో వ్యాపారాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. బొగ్గు మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నేపథ్యంలో సంస్థ లాభాలు తగ్గాయని, మహానది, కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లాంటి సంస్థల బొగ్గు సరఫరా కావడం, ప్రైవేట్ సంస్థలు బొగ్గు తక్కువ ధరకు అమ్మడం వల్ల సింగరేణి మార్కె ట్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని మంత్రు లు అన్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా సింగరేణి తన బొగ్గు ధరలను హేతుబద్దీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దశల వారీగా బకాయిల వసూలు...
సింగరేణి సంస్థకు ఏళ్ల తరబడి జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు బాకీ పడిన రూ.56వేల కోట్లను దశల వారీగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు అన్నారు. పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదని వారు చెప్పారు. విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కోరం కనకయ్య, మట్ట రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, మాలోతు రాందాస్‌నాయక్, గండ్ర సత్యనారాయణరావు, విజయరమణారావు, ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ బుద్ర ప్రకాష్ జ్యోతి, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.