Share News

వంటింట్లో సిలిం‘డర్‌’

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:48 AM

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్‌కు కొరత ఏర్పడే ప్రమాదమేర్పడింది.

వంటింట్లో సిలిం‘డర్‌’

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్‌కు కొరత ఏర్పడే ప్రమాదమేర్పడింది. పదిరోజుల నుంచి యుద్ధం జరుగుతుండడంతో గ్యాస్‌ సరఫరా చేసే విషయమై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విఽధిస్తూ వస్తున్నది. కొరతను అధిగమించేందుకు ఇష్టారాజ్యంగా గ్యాస్‌బుకింగ్‌ చేసుకోకుండా ఉండేందుకు సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య బుకింగ్‌ వ్యవధిని పెంచుతూ వస్తున్నది. తాజాగా సింగిల్‌ సిలిండర్‌ బుకింగ్‌ను 25రోజులకు, డబుల్‌ సిలిండర్‌ బుకింగ్‌ను 30రోజులకు పెంచారు. కమర్షియల్‌ సిలిండర్ల పంపిణీని నియంత్రిస్తున్నారు. గ్యాస్‌ కొరతను అధిగమించే వరకు కొత్తగా కమర్షియల్‌, గృహవసరాల గ్యాస్‌కనెక్షన్లు మంజూరు చేయవద్దని ఆయా చమురు సంస్థలు తమ డీలర్లకు ఆదేశాలు జారీచేశారు. యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే కమర్షియల్‌ సిలిండ్లర్లపై 115రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. గృహవినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర 985రూపాయలకు, కమర్షియల్‌ సిలిండర్‌ ధర 2145రూపాయలకు పెరిగింది. దీంతో వినియోగదారులపై తీరని భారం పడింది. గ్యాస్‌ ధరల పెంపును సాకుగా తీసుకుని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు ధరలను పెంచుతున్నారు. యుద్ధం కారణంగా ఇరాన్‌, ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి ఇంధన వనరుల సరఫరా నిలిచిపోవడం వల్ల ఇంధన కొరత ఏర్పడుతున్నది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ యుద్ధం మరింత తీవ్ర కావచ్చని తెలుస్తున్నది.

ఫ 25, 30రోజులకోసారి గ్యాస్‌ బుకింగ్‌..

పెద్దపల్లి జిల్లాలో 2లక్షలకు పైగా గృహ అవసరాల కోసం తీసుకున్న గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్‌ సిలిండర్లు 19వేలకు పైగా ఉన్నాయి. గృహ అవసరాల సిలిండర్ల బుకింగ్‌కు సాధారణ రోజుల్లో 15రోజులు ఉండేది. యుద్ధం మొదలై గ్యాస్‌ సరఫరా నిలిచిపోయిన తర్వాత 21రోజులకు, యుద్ధం మరింత తీవ్రం అవుతుండడంతో 25రోజులకు పెంచారు. డబుల్‌ సిలిండర్లు ఉన్నవాళ్లు మరో ఐదు రోజులు ఆగాల్సిందే. దేశంలోనూ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నప్పటికీ, అవి దేశ అవసరాలకు సరిపోవు. అదనంగా గల్ఫ్‌ దేశాల నుంచి చమురు కంపెనీలు గ్యాస్‌ సరఫరా చేసుకుని వినియోగదారులకు అందిస్తున్నాయి. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గ్యాస్‌ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా వంట గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. దీంతో గ్యాస్‌ వినియోగం పెరిగింది. కట్టెల పొయ్యిల వల్ల పొగ చూరడంతో పాటు శ్వాసకోశవ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, వాతావరణ కాలుష్యం పెరగకుండా ఉండేందుకు గాను అనేకమంది వంట గ్యాస్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్యాస్‌ కొరత ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది.

ఫ కొద్ది రోజులు గ్యాస్‌ వాడకం తగ్గించాలి..

అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం సద్దుమణిగే వరకు గ్యాస్‌ వాడకంలో స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌పై అన్నం వండకుండా కూరలు, టీ వంటివి మాత్రమే కాచుకోవాలని, అన్నం వండేందుకు ఎలక్ర్టికల్‌ కుక్కర్లను వినియోగించుకోవాలని చెబుతున్నారు. ఇళ్లల్లో కొందరు స్నానాలు చేసేందుకు గాను వేడినీళ్లను గ్యాస్‌ స్టౌలపైనే కాస్తున్నారు. దానిని నిరోధించి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్‌ వాటర్‌హీటర్లను సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. కమర్షియల్‌ అవసరాలకు ఎప్పుడు పడితే అప్పుడు గ్యాస్‌సరఫరా చేసే పరిస్థితి లేదు. సాధారణ రోజుల్లోనే చిన్నచిన్న హోటళ్లు, కాఫీ, టీసెంటర్లు, పుట్‌పాత్‌లపై నడిపించే టిపిన్‌ సెంటర్ల నిర్వాహ కులు సబ్సిడీ గ్యాస్‌ను వాడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో దానిని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని, గృహవినియోగదారులు గ్యాస్‌సిలిండర్లు అమ్ముకోకుండా జాగ్రత్తలు తీసుకోవా లని చమురు కంపెనీలు సూచిస్తున్నాయి.

Updated Date - Mar 11 , 2026 | 12:49 AM