Share News

కరీంనగర్‌ పోలీసుల అదుపులో సైబర్‌క్రైం ముఠా

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:51 PM

కరీంనగర్‌ పోలీసులు భారీ సైబర్‌ క్రైం నెట్‌వర్క్‌ను చేధించారు. సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తూ, అక్రమ లావాదేవీలకు వేదికగా ఉపయోగపడుతున్న మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్‌లో 8 సైబర్‌ క్రైం కేసుల్లో మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాల ద్వారా 138 కోట్ల రూపాయలు ఫ్రాడ్‌ జరగగా, ఇద్దరు బ్యాంక్‌ ఉద్యోగులతో సహా 13 మంది నిందితులను కరీంనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

కరీంనగర్‌ పోలీసుల అదుపులో సైబర్‌క్రైం ముఠా
నిందితులను అరెస్టు చూపుతున్న సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ పోలీసులు భారీ సైబర్‌ క్రైం నెట్‌వర్క్‌ను చేధించారు. సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తూ, అక్రమ లావాదేవీలకు వేదికగా ఉపయోగపడుతున్న మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్‌లో 8 సైబర్‌ క్రైం కేసుల్లో మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాల ద్వారా 138 కోట్ల రూపాయలు ఫ్రాడ్‌ జరగగా, ఇద్దరు బ్యాంక్‌ ఉద్యోగులతో సహా 13 మంది నిందితులను కరీంనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని, నిందితుల బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం మీడియాకు వివరాలు అందించారు. కరీంనగర్‌లోని రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆర్‌బీఎల్‌)లో 24 మంది మ్యూల్‌ కరెంట్‌ అకౌంట్‌లు తెరచి సైబర్‌ముఠాలోని చైనీస్‌కు చెందిన సైబర్‌ నేరగాళ్లకు కరీంనగర్‌లో ప్రధాన నిందితులు బండారి సాయిరాం ఇన్‌స్టాగ్రాంద్వారా మ్యూల్‌ ఖాతా వివరాలు పంపించారని సీపీ తెలిపారు. ఈ ఖాతాల ద్వారా సైబర్‌ ముఠా నేరగాళ్లు చేసిన నేరాలకు సంబంధించి వర్చువల్‌ ఖాతాల ద్వారా12 కోట్ల 25 లక్షల 31 వేల 665 రూపాయలు, ఆర్‌బీఎల్‌ మ్యూల్‌ ఖాతాలద్వారా 125 కోట్ల 80 లోల 71 వేల 688 రూపాయలు మొత్తం సుమారు 138 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని తెలిపారు. సైబర్‌ క్రైం మోసాలపై కరీంనగర్‌లో నమోదైన 8 కేసుల్లో ప్రధాన నిందితుడు జగిత్యాల జిల్లా వెల్గటూర్‌కు చెందిన బండారి సాయిరాం(30) చైనీస్‌ సైబర్‌ క్రైం ముఠాతో సంబంధాలు కలిగి ఉండగా అతనికి బుగ్గారం మండలం గోపాల్‌పూర్‌కు చెందిన అనుమాండ్ల రంజిత్‌(36), పెద్దపల్లి జిల్లా ధర్మారంకు చెందిన అలిగేటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన భోగ రాకేష్‌(35), రామడుగుకు చెందిన బండి ప్రణయ్‌(25)లు సహకరిస్తూ అమాయకుల నుంచి మ్యూల్‌ ఖాతాలు తెరిపించి, ఖాతా పుస్తకం, ఏటీఎం కార్డులతోసహా కిట్‌ను ప్రధాననిందితుడు బండారి సాయిరాంకు అప్పగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సైబర్‌ నేరగాళ్ళకు మ్యూల్‌ కరెంట్‌ అకౌంట్లు తెరిచేందుకు రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మేనేజర్‌ హన్మకొండకు చెందిన భువనగిరి కళ్యాణ్‌(52), క్యాషియర్‌ కరీంనగర్‌కు చెందిన ఆయేషా బేగం(30)లు సహకరించారని సీపీ తెలిపారు. ఇందుకుగాను ఒక్కో ఖాతకు 30 నుంచి 35 వేల రూపాయలు బ్యాంక్‌ మేనేజర్‌, క్యాషియర్‌ డబ్బులు తీసుకున్నారని, సైబర్‌ నేరగాళ్ళతో వాట్సప్‌ చాటింగ్‌, కాల్‌రికార్డుల ఆధారాలు లభించినట్లు తెలిపారు. కాగా ధర్మారంకు చెందిన విభూది రాంకుమార్‌(37), జగిత్యాల జిల్లా లక్ష్మిపూర్‌కు చెందిన నతర్ల శ్రీనివాస్‌(39), వరంగల్‌కు చెందిన కర్రె రాజు(35), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్‌(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేష్‌(27)లు ఆర్‌బీఎల్‌లో ఖాతాలు తెరచి ప్రధాన నిందితుడు బండారి సాయిరాంకు అప్పగించారని, ఇందుకుగాను ఒక్కో ఖాతాదారుడికి 30 వేల రూపాయలుతో పాటు వారి ఖాతాను ఉపయోగించుకుని ప్రతి లావాదేవికి 2 నుంచి 4 శాతం కమిషన్‌ రూపంలో డబ్బులు ముట్టాయని సీపీ గౌస్‌ ఆలం వివరించారు. ఖాతాదారులతోపాటు మద్యవర్తులు, బ్యాంక్‌ ఉద్యోగులకు కమిషన్‌ రూపంలోనే 3 కోట్ల వరకు ముట్టినట్లు విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. కరీంనగర్‌ పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలో జరిగిన సైబర్‌ నేరాలకు సంబంధించి నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)లో 815 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటి వరకు 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 25 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. సంబంధిత ఖాతాలను ఫ్రీజ్‌ చేశామని తెలిపారు. సైబర్‌ నేరాలకు పాల్పడిన నిందితులు ఆ డబ్బులను విదేశాలకు మళ్ళిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో మిగతా నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల్లో ఒక రాజకీయనాయకుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సైబర్‌ ముఠాను అరెస్టు చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు కె రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:51 PM