Share News

వేములవాడలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:07 AM

వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది.

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవురోజు కావడంతో గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు చేరుకుని ఆలయ వసతిగదుల్లో విడిది చేశారు. తెల్లవారు జామునే భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్రస్నానాలను ఆచరించారు. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మరికొంత మంది భక్తులు అభిషేక పూజ, అన్నపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. పరివార దేవతాలయాలమైన గాయత్రి మాత ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొనగా నగరేశ్వర ఆలయంలో సత్యనారాయణ వ్రతం, చండీహోమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా దంపతులు శివకళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jun 27 , 2026 | 12:07 AM