Share News

వెనుకబడిన విద్యార్థులపై నజర్‌

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:02 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

వెనుకబడిన విద్యార్థులపై నజర్‌

జగిత్యాల, ఆగస్టు22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాయంత్రం అదనంగా ప్రత్యేక పీరియడ్‌ నిర్వహిస్తోంది. బడి వేళలు ముగిసిన అనంతరం ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. ఆయా విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి సంబంధిత ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా బోధన చేయిస్తున్నారు. పాఠ్యాంశాలపై అవగాహన కల్పిచడంతో పాటు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన మెళకువలు, రెమిడియల్‌ బోధన అందిస్తున్నారు.

ఫతల్లిదండ్రులకూ ఊరట..

గ్రామాల్లో చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం 5 గంటల సమయంలో ఇళ్లకు చేరుకుంటారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు సాధారణంగా సాయంత్రం 4 గంటలకే ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు వచ్చే వరకు వారు ఇళ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ సమయంలో ఆటపాటలు, అల్లర్లు వంటి వాటితో పిల్లలు సమయాన్ని గడుపుతుండటంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల కంటే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితిని విద్యాశాఖ గుర్తించింది.

ఫవిద్యార్థుల సందేహాల నివృత్తి

సాయంత్రం ప్రత్యేక పీరియడ్‌ను కేవలం అదనపు తరగతిగా కాకుండా విద్యార్థుల విద్యా సామర్థ్యాలను మెరుగుపర్చేలా నిర్వహిస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి ఏ సబ్జెక్టులో ఎవరు వెనుకబడి ఉన్నారో గుర్తిస్తున్నారు. అనంతరం సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు వారికి ప్రత్యేకంగా బోధిస్తున్నారు. క్లిష్టంగా ఉన్న పాఠ్యాంశాలను సులభమైన పద్ధతుల్లో వివరించడం, సందేహాలను నివృత్తి చేయడం, పరీక్షల్లో సమాధానాలు రాసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ తరగతుల్లో అర్థం కాని అంశాలను మరోసారి సులభమైన పద్ధతిలో వివరిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో సబ్జెక్టులపై ఉన్న భయం తగ్గించి.. ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఫప్రభుత్వ బడులపై నమ్మకం పెంచేలా..

ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ సమయం బోధన జరుగుతోందనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల ల్లోనూ విద్యార్థులకు అదనపు సమయం కేటాయించి వారి అభ్యసన సామర్థ్యాలను పెంచాలని విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 850 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో సుమారు 55,982 మంది విద్యార్థులున్నారు. దీంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సాయంత్రం ప్రత్యేక తరగతులు కీలకంగా మారనున్నాయి. పదో తరగతి విద్యార్థులపై మరింత దృష్టి సారించి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయనున్నారు. డీఈవో రాము ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతూ విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.

ఫఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు..

కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అదనపు తరగతులను వ్యతిరేకిస్తుండగా కొందరు ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. అదనపు తరగతులపై ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా తరగతి గదిలో అందరికీ ఒకే విధంగా బోధన చేయడం కంటే వెనుకబడిన విద్యార్థుల స్థాయిని గుర్తించి వారికి అనుగుణంగా బోధించడం ఈ ప్రత్యేక తరగతుల ప్రధాన ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారు. దీంతో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా మారుతున్నాయి. విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికే...

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేస్తున్నాం. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడి ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ, ఇతర పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే తల్లిదండ్రుల సమస్యలకు అదనపు తరగతులతో పరిష్కారం దొరకుతుంది.

Updated Date - Aug 24 , 2026 | 01:02 AM