భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:46 PM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
వేములవాడ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్రస్నానాలు ఆచరించారు. ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకుని స్వామివారి దర్శించుకున్నారు. ఆషాఢ మాసం వర్షాకాలం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బోనాల పండుగలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.