Share News

ఆరుతడి పంటలే మేలు

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:48 AM

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

ఆరుతడి పంటలే మేలు

జగిత్యాల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రైతులకు నష్టం వాటిళ్లకుండా తక్కువ నీటి లభ్యతతో సాగు చేసే ఆరు తడి పంటలపై దృష్టి సారించాలంటున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంటలు సాగు చేయని ప్రాంతాల్లో మూడు దశల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 4.38 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే పలు చోట్ల వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వరి ప్రధానంగా సాగు అవుతుందని అంచనా వేశారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితుల కారణంగా ఆరుతడి పంటలు సాగు చేసే దిశగా కసరత్తులు చేస్తున్నారు.

ఫఎల్‌నినో ప్రభావం..

పసిఫిక్‌ మహాసముద్రం మధ్య, తూర్పు భాగంలోని సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. దీంతో పసిఫిక్‌ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కుతుందంటున్నారు. ఈ వేడి గాలులు భారతదేశం వైపు వీస్తాయి. దీంతో నైరుతి రుతు పవనాలు బలహీన పడి వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు.

ఫమారనున్న పంటల సాగు అంచనా..

వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళికలను అమలు చేసేందుకు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలతో పాటు తక్కువ సమయంలో అధిక దిగుబడులు ఇచ్చే పంట రకాలపై అవగాహన కల్పిస్తున్నారు. భూసారం పెంపొందించడం, ఆరోగ్యానికి మేలు చేసే పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలను ప్రోత్సహిస్తారు.

ఫమూడు దశల్లో ప్రణాళికలు..

ఎల్‌నినో ప్రభావంతో మూడు దశల్లో కంటిజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేశారు. వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా ఈనెల 15వ తేదీ వరకు మొదటి దశ, 15వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు రెండో దశ ప్రణాళిక, జూలై 30వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మూడో దశ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయనున్నారు. ఆయా తేదీల్లోపు కురిసిన వర్షపాతం ఆధారంగా పంటల ప్రణాళికలు అమలు చేస్తారు.

ఫజిల్లాలో ఆయకట్టు ఇలా..

జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 4,38,054 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఎస్సారెస్పీ కాలువ కింద 1,51,746 ఎకరాలు, చెరువులు, కుంటల కింద 74,457 ఎకరాలు, బోర్లు, బావుల కింద 1,92,151 ఎకరాలు, వర్షాధార భూములు 19,700 ఎకరాలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 75,447 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి 15,024 ఎకరాలు, మొక్కజొన్న 31,394 ఎకరాలు, పత్తి 17,145 ఎకరాలు, సోయా 740 ఎకరాలు, రెడ్‌ గ్రామ్‌ 949 ఎకరాలు, గ్రీన్‌ గ్రామ్‌ 245 ఎకరాలు, చెరుకు 106 ఎకరాలు, అనుములు 246 ఎకరాలు, పసుపు 9,148 ఎకరాలు, మిరప 89 ఎకరాలు, వివిధ రకాల కూరగాయల పంటలు 349 ఎకరాల్లో సాగు అవుతన్నాయి.

ఫప్రత్యామ్నాయ పంటలివే..

జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో కందులు 53,817 ఎకరాలు, పెసర 7,175 ఎకరాలు, జొన్నలు 3,284 ఎకరాలు, మినుము 8,803 ఎకరాలు, మొక్కజొన్న 57,198 ఎకరాలు, వెజిటేబుల్స్‌ 7,190 ఎకరాలు, ఇతర పంటలు 14,698 ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు ప్రత్యామ్నయ ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందుకు గానూ కంది విత్తనాలు 3,768 క్వింటాళ్లు, పెసర విత్తనం 574 క్వింటాళ్లు, జొన్న విత్తనం 263 క్వింటాళ్లు, మినుము విత్తనం 705 క్వింటాళ్లు, మొక్కజొన్న విత్తనం 4,576 క్వింటాళ్లు, వెజిటేబుల్స్‌ 18 క్వింటాళ్లు అవసరమని అంచనా వేసి అందుబాటులో ఉంచుతున్నారు.

ఫముఖం చాటేసిన వరుణుడు...

జిల్లాలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల వరుణుడు ముఖం చాటేశాడు. ప్రస్తుత సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే తక్కువగా వర్షం కురిసింది. జిల్లాలోని మల్లాపూర్‌, జగిత్యాల రూరల్‌ మండలాల్లో మినహా అన్ని మండలాల్లో లోటు వర్షం నమోదైంది. వెల్గటూరు మండలంలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా గత వానాకాలం సీజన్‌లో ఈ సమయం వరకు 195.8 మిల్లీ మీటర్ల సగటు వర్షం కురిసింది. ప్రస్తుత సీజన్‌లో 167.5 మిల్లీమీటర్ల సగటు వర్షం నమోదైంది.

ఫతగ్గుతున్న భూగర్భ జలాలు..

జిల్లాలో రోజురోజుకు భూగర్బ జలాలు తగ్గుతున్నాయి. జిల్లాలో ప్రస్తుత జూలై మాసంలో 6.16 మీటర్ల లోతుకు భూగర్బ జలాలున్నాయి ప్రస్తుతం యేడాది మే మాసంలో 5.81 మీటర్ల లోతుకు, జూన్‌ మాసంలో 6.13 మీటర్ల లోతుకు భూగర్బ జలాలున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. గత యేడాదితో పోలిస్తే 1.66 మీటర్ల సగటు లోతుకు భూగర్భ జలాలున్నాయి. జిల్లాలో కొడిమ్యాల మండలంలో అత్యధికంగా 14.89 మీటర్ల లోతుకు, అత్యల్పంగా బీర్‌పూర్‌ మండలంలో 2.94 మీటర్ల లోతుకు భూగర్భ జలాలున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ప్రకటించారు.

ల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి

కరోనా మహమ్మారి సమయంలో అందరూ సమిష్టిగా పనిచేసి సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించినట్లుగానే ఇప్పుడు ఎల్‌నినో కారణంగా ఏర్పడుతున్న విపత్కర పరిస్థితులను కూడా అదే స్ఫూర్తితో ఎదుర్కోవాలి. రాబోయే రోజుల్లో తాగునీటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.

ఆరుతడి పంటలు సాగు చేయాలి

- సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ఎల్‌నినో ప్రభావం, వాస్తవ పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. పరిస్థితులను దాచిపెట్టకుండా రైతులకు స్పష్టంగా వివరించి శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. ఎక్కువ నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా, మొక్కజొన్న, కందులు, పప్పు ధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంపిక చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. రైతులు పెద్దఎత్తున ఆయిల్‌పామ్‌ సాగు వైపు మొగ్గు చూపాలి.

Updated Date - Jul 23 , 2026 | 12:48 AM