Share News

పంటల సర్వేకు శ్రీకారం

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:43 PM

యాసంగి సీజన్‌ 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల డిజిటల్‌ క్రాప్‌ సర్వే నిర్వహణకు ప్రైవేట్‌ వలంటీర్లను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

పంటల సర్వేకు శ్రీకారం

హుజూరాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌ 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల డిజిటల్‌ క్రాప్‌ సర్వే నిర్వహణకు ప్రైవేట్‌ వలంటీర్లను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ప్రతి సీజన్‌లో స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి నివేదికలు సమర్పించేవారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తూ డిజిటల్‌ విధానాన్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. పంటల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. దీంతో సర్వే ప్రక్రియ పారదర్శకంగా, సమగ్రంగా జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫ యాప్‌లో పకడ్బందీగా నమోదు

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో వలంటీర్లు ప్రతిరోజూ సర్వే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 45 రోజుల్లోపు సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి సర్వే నంబరు భౌగోళిక స్థితి, ఆక్షాంశ-రేఖాంశ వివరాలతో పాటు ఏ పంట వేశారన్న సమాచారం నమోదు అవుతుంది. మండల వ్యాప్తంగా 23 వేల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఏవో, ఏడీఏలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు సూచించారు. డేటా నమోదు కచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఫ అర్హులకే ప్రాధాన్యం

గ్రామాల్లో వలంటీర్ల ఎంపిక బాధ్యతను స్థానిక ఏఈవోలకు అప్పగించారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, అగ్రికల్చర్‌ డిప్లొమా లేదా సైన్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకులను ఎంపిక చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఉండడంతోపాటు డేటా ఎంట్రీ సామర్థ్యం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎంపికైన వలంటీర్లకు ఒక్కో సర్వే నంబరుకు ఏడు రూపాయల చొప్పున చెల్లిస్తారు. సాంకే తిక పరిజ్ఞానంపై పట్టున్న యువతను వినియోగించడం ద్వారా సర్వే వేగవంతం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎంపిక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఫ నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం

భూంరెడ్డి, హుజూరాబాద్‌ మండల వ్యవసాయాధికారి

వ్యవసాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో వలంటీర్లను ఎంపిక చేసి నివేదికలు పంపించాం. డిజిటల్‌ సర్వే ద్వారా మండలంలో ఏ రకమైన పంటలు సాగు చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. పంటల అంచనాల్లో కచ్చితత్వం పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు ఇది దోహదం చేస్తుంది. నిర్ణీత గడువులోపు సర్వే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను అమలు చేస్తాం.

Updated Date - Feb 21 , 2026 | 11:43 PM