అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే వారిపై క్రిమినల్ చర్యలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:49 PM
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు.
భగత్‌నగర్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలకు అనుమతుల కోసం డబ్బులు అడగవద్దని, నగరవాసులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. బ్రోకర్ల ద్వారా ఏజెన్సీలను పెట్టుకుని ప్రజలను వేధిస్తూ లంచాలు తీసుకుని అనుమతి ఇవ్వాలనుకుంటే మాత్రం ఉపక్షించే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే బదిలీపై వెళ్లవచ్చన్నారు. నిజాయితీగా, నిబంధనల ప్రకారం పనిచేసే వారిపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని తెలిపారు. అటువంటి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. బెదిరించడానికో, భయపెట్టడానికో పిలవలేదని, పూర్తి పారదర్శకతతో పనిచేయాలన్నారు. బీజేపీ కార్పోరేటర్ల నుంచి ఒత్తిళ్లు రాకుండా తాను చూసుకుంటానన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీతో అంటకాగుతూ అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. టౌన్ ప్లానింగ్ అంటేనే కరప్షన్ అనే భావన ప్రజల్లో పేరుకు పోయిందన్నారు. టౌనింగ్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న తనకు ప్రత్యేక ఇంటెలిజన్స్ వ్యవస్థ ఉంటుందని, ఏ అధికారి ఏ విధంగా పనిచేస్తున్నారో అన్నీ తెలుస్తాయన్నారు. ఎక్కడైనా అనధికారికంగా ఇళ్లు, కమర్షియల్ భవనాలు నిర్మిస్తుంటే ప్రారంభంలోనే నోటీసులు ఇచ్చి వాటిని ఆపాలన్నారు. నోటీసులకు సమాధానం ఇవ్వక పోతే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సాయం తీసుకుని వాటిని కూల్చి వేయాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలన్నారు. గతంలో నగరంలో ఇంటి ముందు ఇసుక, కంకర కనిపిస్తే చాలు.. ఓ వైపు కార్పోరేటర్లు, మరో వైపు టౌన్ ప్లానింగ్ అదికారులు వాలిపోయి బెదిరించి డబ్బులు వసూలు చేసే వారన్నారు. అలాంటి కార్పొరేటర్లను ప్రజలు తిరస్కరించారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 46 మంది కొత్త కార్పొరేటర్లే ఎన్నికయ్యారన్నారు. బీజేపీ కార్పొరేటర్లు అలాంటి వాటి జోలికి పోరని, ఇతర పార్టీల వారు ఎవరైనా వాటికి అలవాటు పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మూడు రోజుల్లో కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్ రెవెన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్‌కు ఐకానిక్‌గా ఉండే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. వాటి అమలు, నిదుల కోసం తాను ప్రయత్నిస్తానన్నారు. త్వరలోనే అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఆసుపత్రులు, మార్కెట్ కూడళ్లలో పేదలకు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటి మేయర్ సునీల్‌రావు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.