నేరాల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:50 PM
సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యం ఇస్తూనే, జరిగిన నేరాలను త్వరగా ఛేదించి బాధితులకు న్యాయం అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు.
ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల టౌన, జూన 05(ఆంధ్రజ్యోతి): సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యం ఇస్తూనే, జరిగిన నేరాలను త్వరగా ఛేదించి బాధితులకు న్యాయం అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి వాటి సంఖ్యను తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోక్సో, గ్రేవ్, నాన గ్రేవ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టులో చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వారికి నాణ్యమైన, సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. గంజాయి సరఫరా మార్గాలను గుర్తించి కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో నిర్వహించే గ్రామసభలను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రౌడీ షీట్లు తెరవండి..
సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పట్టణం, కాలనీ, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యాన్ని ప్రజలకు, వ్యాపారులకు వివరించాలని సూచించారు. దొంగతనాల నివారణకు ప్రతీ సర్కిల్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పటిష్టచర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూవివాదాలు, పాత కక్షలతో నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై అవసరమైతే కొత్తగా రౌడీషీట్లు తెరవాలని సూచించారు. సమావేశ అనంతరం ఇటీవల జరిగిన బక్రీద్, హనుమాన జయంత్సుత్సవాలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించి ఉత్తమ ప్రతిభ కనబరిచివారికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చేతన నితిన, ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణ, డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు, ఇనెస్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.