Share News

పత్తి విత్తనాలు రెడీ...

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:12 AM

రైతులు వానాకాలంసాగుకు సన్నద్ధమవుతున్నారు. ఎరువుల దుకాణాల్లో పత్తి విత్తనాలను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు.

పత్తి విత్తనాలు రెడీ...
హుజూరాబాద్‌లోని ఎరువుల దుకాణంలో ఉన్న పత్తి విత్తనాలు

హుజూరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రైతులు వానాకాలంసాగుకు సన్నద్ధమవుతున్నారు. ఎరువుల దుకాణాల్లో పత్తి విత్తనాలను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. మూడు రోజుల క్రితం మోస్తరు వర్షం కురవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. డివిజన్‌లో జమ్మికుంట, హుజూరాబాద్‌, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్‌ మండలాలు ఉండగా 1.20లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. ఇందులో 30వేల ఎకరాల్లో బీటీ-2 పత్తి సాగు చేస్తారు. 2025 సంవత్సరంలో పత్తి విత్తన ప్యాకెట్‌పై 37 రూపాయల ధర పెంచగా, ఈ సారి కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచలేదు. బీటీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్‌కు 901 రూపాయల ధర ఉంది. డివిజన్‌లో 30 వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుండగా, ఎకరాకు రెండు పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. విత్తనాలు పెట్టిన తర్వాత వర్షాలు కురిస్తే 65 శాతం విత్తనాలు మాత్రమే మెలకెత్తుతాయి. మళ్లీ పత్తి గింజలు అవసరం ఉంటాయి. మొత్తంగా సుమారు 60 వేల పత్తి ప్యాకెట్లు హుజూరాబాద్‌ డివిజన్‌కు అవసరమవుతాయి. ఇప్పటి వరకు 30వేల పత్తి ప్యాకెట్లు ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. గత సంవత్సరం పంట చేతికచ్చే దశలో కాయలోనే చీడపీడలు సోకి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. రైతులకు గిట్టుబాటు ధర అందలేదు. వ్యవసాయాధికారులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఫ విత్తనాలు ఎరువుల దుకాణాల్లో కొనాలి..

- సునీత, ఏడీఏ, హుజూరాబాద్‌

రైతులు పత్తి విత్తనాలను లైసెన్స్‌ ఉన్న ఎరువుల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. విత్తనాలను కొనుగోలు చేసిన తర్వాత రసీదును జాగ్రత్తగా దాచుకోవాలి. బీటీ-2 పత్తి విత్తనాలు డివిజన్‌లోని అన్ని ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. మొదటి వర్షానికే రైతులు విత్తనాలు వేసి నష్టపోవద్దు, అదును చూసి పత్తి విత్తనాలు వేసుకోవాలి.

Updated Date - Jun 07 , 2026 | 12:12 AM