తగ్గిన పత్తి ధరలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:44 PM
పత్తి రైతును ఈ సీజన్‌లో కష్టాలువెంటాడుతున్నాయి. అరకొర దిగుబడులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ధరల పతనం మరింత ఆందోళన కలిగిస్తోంది.
జమ్మికుంట రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతును ఈ సీజన్‌లో కష్టాలువెంటాడుతున్నాయి. అరకొర దిగుబడులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ధరల పతనం మరింత ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా 9,250 రూపాయల ధర పలకగా.. ప్రస్తుతం ఆ ధర 8,830కి పడిపోయింది. కొద్ది రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు 420 రూపాయలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సోమవారం 8,830 నుండి 8200 రూపాయల వరకు వ్యాపారులు ధరలు చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకాల ఎత్తివేతను పొడిగించడంతో ధరలు తగ్గాయని వ్యాపారుల అంటున్నారు.
ఫ సీసీఐ వైపు రైతుల చూపు!
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో మూడు రోజుల క్రితమే సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ.. మార్కెట్లో పైవ్రేటు వ్యాపారులు మద్దతు ధర కంటే అధికంగా చెల్లిస్తుండడడంతో ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పైవ్రేటు వ్యాపారుల వద్ద క్వింటాలుకు ఎనిమిది వేల నుంచి 8,500 మధ్య ధరలు ఉండగా.. సీసీఐ ప్రకటించిన మద్దతు ధర 8,667గా ఉంది. ప్రైవేటు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులు సీసీఐకి పత్తి విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. తేమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పత్తిని సీసీఐకి విక్రయిస్తే మద్దతు ధర లభించే అవకాశం ఉంది.