Share News

అవినీతికి చెక్‌ పెట్టాల్సిందే..

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:05 AM

మానకొండూర్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ పంచాయతీ కార్యదర్శి తానే పింఛన్‌ మంజూరు చేయించానని, 10 వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసి ఏసీబీ అధికారులకు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు.

అవినీతికి చెక్‌ పెట్టాల్సిందే..

- పింఛన్లు ఇప్పిస్తామంటూ బేరసారాలు

- అమాయకులే ఆసరాగా అక్రమాలకు తెర

- నమ్మి మోసపోతున్న దరఖాస్తుదారులు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

- మానకొండూర్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ పంచాయతీ కార్యదర్శి తానే పింఛన్‌ మంజూరు చేయించానని, 10 వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసి ఏసీబీ అధికారులకు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. పింఛన్‌ మంజూరై, ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన తర్వాత కూడా తానే పింఛన్‌ వచ్చేలా చేశానని తప్పకుండా 10 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితుల తరపున సంబంధీకులు అతడిని పట్టించారు. పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన తర్వాత అతడిని పట్టించిన వ్యక్తిని గ్రామస్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ పంచాయతీ వద్ద సన్మానించారు. అంటే అతడు ఇంకెంతమందిని వేధించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ఊళ్లో ఇంకా ఎంతమంది నుంచి ఈ విధంగా డబ్బులు వసూలు చేశాడోననే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

- జిల్లావ్యాప్తంగా 24,634 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 14,834 మంది చేయూత ఆసరా పింఛన్‌కు అర్హత సాధించారు. మిగతా 9,800 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో నాలుగు వేలకుపైగా అర్జీలు డబుల్‌ పేర్లతో ఉన్నాయి. మరో ఐదువేల మంది నూతన పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా కొందరు పంచాయతీ కార్యదర్శులు, డీఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తయకు పరిచయమని దళారులు అందినకాడికి డబ్బులను బాధితులనుంచి తీసుకుంటున్నారు. రెండు వేలు మొదలు 10 వేల వరకు వీలును బట్టి దర్జాగా వసూలు చేసుకుంటున్నారు.

ఫ చేతి వాటాల జోరు...

పింఛన్ల కోసం జిల్లాలో మొదటి నుంచి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నామనే సాకుతో గద్దల్లా వాలిపోతూ వారి నుంచి అందినకాడికి డబ్బులు తీసుకుంటున్నారు. ఎలాగోలా తమ చేతికి పింఛన్‌ వస్తే చాలనే తీరుతో కొందరు గుట్టుచప్పుడు కాకుండా బేరసారాలు చేసి అడిగిన దాంట్లో ఎంతో కొంత రహస్యంగా ముట్ట చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదనే ఒప్పందాల్ని చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి దళారులకు పింఛన్ల దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్‌ అప్‌లోడింగ్‌, పత్రాల మంజూరు దశలో క్షేత్రస్థాయి సిబ్బంది వసూళ్లు చేసిన అక్రమపు సొమ్ములో వారి వాటాలు తీసుకుని పనికానిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్టోబరు నెలలోనే వెరిఫికేషన్‌ పేరుతో ఎక్కువగా బేరసారాలు సాగించి చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరాయి.

ఫ అనర్హత సాకుతో...

అనర్హత సాకుతోనే దళారులు, కొంతమంది సిబ్బంది పింఛన్ల మంజూరు విషయంలో కొందరి నుంచి డబ్బులను వసూళ్లు చేశారనే అభియోగాలున్నాయి. ముఖ్యంగా ఆదాయం పరిమితిని దాటిందని ఇతరత్రా సాంకేతిక లోపంతో మీకు పింఛన్‌రాదని చెబుతూ కొందరు జేబుల్లోకి పైసలు వచ్చే పన్నాగాన్ని పన్నినట్లు తెలిసింది. అక్కడక్కడ చోటామోటా లీడర్లు కూడా తమకు దస్ర్తాలు ఇస్తే అన్ని తామే పూర్తి చేస్తామని నమ్మబలికిన ఉదంతాలున్నాయి. చాలాచోట్ల నిజంగా అర్హులైన వారి నుంచి కూడా ఇలా వసూళ్లు చేశారు. నిబంధనల ప్రకారం పింఛన్‌ మంజూరైనా అది తామే ఇప్పించామని లబ్ధిదారులకు చెప్పారు. ఇంకొన్నిచోట్ల ముందుగా కొంత మొత్తం. మంజూరయ్యాక కొంత మొత్తం ఇవ్వాలనే ఒప్పందాలు లోలోపల జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో అసలేమి జరిగిందనే విషయంలో డీఆర్డీఏ, జిల్లా పరిషత్‌ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అవినీతికి పాల్పడని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇక మీదట ఎవరు కూడా డబ్బులు ఇవ్వకూడదనే ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలి. ఇలా పక్కాగా ఆరా తీస్తే ఇంకా చాలామంది చేతివాటాన్ని చూపించిన దళారులు, సిబ్బంది బాగోతాలు వెలుగులోకి వచ్చే వీలుంటుంది. ఇప్పటికి ఒక్కరు మాత్రమే ఏసీబీకి దొరకగా తప్పించుకుని తిరుగుతున్న వారు పదుల సంఖ్యలో ఉంటారనే మాట జిల్లాలో వినిపిస్తుంది.

Updated Date - Nov 23 , 2026 | 01:05 AM