విద్యార్థులపై కార్పొరేట్ వల
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:30 AM
పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాక ముందే ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు జోరుగా సాగుతున్నాయి.
- ‘పది’ పరీక్షలకు ముందే ఇంటర్ అడ్మిషన్లు
- రాయితీలు, డిస్కౌంట్లు..
- నిబంధనలు పట్టించుకోని ప్రైవేట్ కళాశాలలు
- చోద్యం చూస్తున్న అధికారులు...
కరీంనగర్ టౌన్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాక ముందే ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు జోరుగా సాగుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమించి ముందస్తు అడ్మిషన్లతో బిజీ అయ్యాయి. పది ఫలితాలు వెలువడిన తర్వాత ఫీజులు అధికంగా ఉంటాయని, ముందే అడ్మిషన్లు తీసుకుంటే రాయితీలు, డిస్కౌంట్లు ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తొందర పడుతున్నారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు రెండు నెలలుగా స్కాలర్‌షిప్ టెస్టులను నిర్వహిస్తూ మెరిట్ స్టూడెంట్స్‌కు ఫీజుల్లో రాయితీలు ఇస్తామని ప్రచారం చేశాయి. దీంతో చాలా మంది ఆ పరీక్షలకు హాజరై అడ్మిషన్లు తీసుకున్నారు. కళాశాలలు వారికి ఇష్టం వచ్చినంత ఫీజులను వసూలు చేశాయి. కొందరికి మాత్రమే ఫీజు రాయితీలు లభించగా మిగిలిన వారు లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వస్తోంది.
ఫ ఆకర్షణీయమైన ప్రకటనలు
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆకర్షణీయమైన ప్రకటనలకు ఆకర్షితులై ఆయా కళాశాలల్లో చేరేందుకు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనితో కొన్ని కళాశాలల యాజమాన్యాలు అడ్డూ అదుపులేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు కళాశాల ప్రమాణాలను బట్టి ఫీజులను నిర్ధారించిన ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
ఫ రూ. లక్షల్లో ఫీజులు
ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్, మెయిన్స్, నీట్, ఎప్‌సెట్ కోచింగ్ పేరిట ప్రైవేట్ కళశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించామంటూ ప్రకటనలతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితోపాటు పీఆర్వోలను నియమించుకొని పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. ఇప్పుడే అడ్మిషన్లు తీసుకుంటే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్‌కు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నా.. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్ కళాశాలలవైపే మొగ్గు చూపుతున్నారు.
ఫ అధికారులకు విద్యార్థి సంఘాల ఫిర్యాదు
పదో తరగతి పరీక్షలకు ముందు యథేచ్చగా సాగుతున్న ముందస్తు అడ్మిషన్లపై విద్యార్థి సంఘాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రైవేట్ కళాశాలలు నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందస్తు అడ్మిషన్లు, అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫీజులపై నియంత్రణ ఉండాలని, ప్రభుత్వమే కళాశాలల ప్రమాణాలను బట్టి ఫీజులను నిర్ధారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.