Share News

విద్యార్థులకు కార్పొరేట్‌ గాలం

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:50 AM

జగిత్యాల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు ముగియక ముందే కార్పొరేట్‌ దందా మొదలైంది. ‘‘హలో సర్‌...మీ అమ్మాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తుందని తెలుసుకున్నాము..

విద్యార్థులకు కార్పొరేట్‌ గాలం

జగిత్యాల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు ముగియక ముందే కార్పొరేట్‌ దందా మొదలైంది. ‘‘హలో సర్‌...మీ అమ్మాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తుందని తెలుసుకున్నాము.. మీ అమ్మాయి బాగా చదువుతుందని ముందు నుంచే విన్నాం.. మా కళాశాలలో నాణ్యమైన బోధన ఉంటుంది. మంచి మార్కులు వచ్చే విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇస్తాం...ఒకసారి మా కాలేజీకి వచ్చి చూడండి...కేవలం ముందస్తు అడ్మిషన్‌ ఫీజు చెల్లిస్తే చాలు’’ అంటూ పలు ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌కాల్స్‌ చేస్తూ అడ్మిషన్ల వల విసురుతున్నాయి. పలు ప్రైవేటు కళాశాలలు తమ దగ్గర ఉన్న సౌకర్యాలు, లేని సౌకర్యాలు, తోక పేర్లను జోడించి తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులను చేర్చుకునేందుకు పలు ఇంటర్‌ కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్స్‌ (పీఆర్‌వోలు)ను నియమించుకొని తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రవేశాలకు ముందస్తుగా తల్లిదండ్రులతో ఒప్పందాలు చేయించుకుంటున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాలతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్ల వ్యాపారం చేస్తున్నారు. పేరు మోసిన తమ కళాశాలల్లో సీట్లు దొరకవని త్వరపడాలని ప్రచారం చేస్తున్నారు. ముందుగా అడ్మిషన్‌ బుక్‌ చేసుకుంటే ఫీజు రాయితీ ఉంటుందని చెబుతున్నారు. ముందుగా సీటు రిజర్వ్‌ చేసుకోకపోతే కోరిన బ్రాంచ్‌లో సీటు దొరకదని బెదరగొడుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో పేరు మోసిన కార్పొరేట్‌ కాలేజీల్లో ముందస్తు అడిష్మన్లు పొందుతున్నారు.

ఫఎస్సెస్సీ పరీక్షలు కాక ముందే..

పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తి కాకముందే కళాశాలల్లో ప్రవేశాలకు ముందస్తు బుకింగ్‌లు జరుగుతున్నాయి. జిల్లాలో మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 12,370 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 285 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల చిరునామా, ఫోన్‌ నంబర్లు కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు, పీఆర్‌వోలకు చేరాయి. దీంతో పరీక్షలతో సంబంధం లేకుండా అడ్మిషన్ల కొరకు ముందస్తు బుకింగ్‌లు జరుపుతున్నారు. ముందస్తుగా బుక్‌ చేస్తే పీఆర్‌వోలకు కమీషన్లు లభిస్తుండడంతో వారు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్‌ అందుతున్నట్లు తెలుస్తోంది.

ఫఅప్రమత్తతే ప్రధానం..

తల్లిదండ్రులు తొందరపడి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి కాలేజీలో చేరితే ఎవ్వరూ పట్టించుకోరని పేర్కొంటున్నారు. కార్పొరేట్‌ కళశాల్లో చేర్పించే ముందు పిల్లల అభిప్రాయాలతో పాటు సదరు కళాశాలల్లో విద్యా బోధన, వసతులు, అనుమతుల గురించి తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తమ విద్యా వ్యాపారం కొరకు నిత్యం పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలున్నాయని, అలాంటి వాటిల్లో చేర్పిస్తే విద్యార్థులు ఒత్తిడికి గురయి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడతారని అంటున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి సంఘాలు

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ రాష్ట్రాల అధికారాలను హరిస్తూ దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు విద్యారంగాన్ని ధారాదత్తం చేస్తోందని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

విందులు...వినోదాలు

కార్పొరేట్‌ కళాశాలల పీఆర్‌వోలు ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలుస్తూ వారికి విందులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ కళాశాలకు అడ్మిషన్లు ఇప్పించాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థుల వివరాలను ముందే తీసుకొని ప్రధానోపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులను కలుస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా ఇప్పించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులకు టూర్‌ ఆఫర్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫఅయోమయంలో తల్లిదండ్రులు...

ఎస్సెస్సీలో మంచి మార్కులు సాధిస్తారన్న అంచనాలున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల సిబ్బంది చేసే ఫోన్‌ కాల్స్‌తో విసుగు చెందుతున్నారు. ఒకవేళ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే కార్లు వేసుకుని ఇళ్ల వద్ద వాలిపోతుండడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి టార్గెట్లు ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీధుల్లో తిప్పుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పది పరీక్షలు రాసిన విద్యార్థుల చిరునామాలు తీసుకొని వారి ఇళ్లకు వెళ్తున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు, ఎవరు చెబితే మాట వింటారో ముందుగానే ఒక అవగాహన వచ్చి వారితో కలిసి అడ్మిషన్ల కోసం ఒత్తిళ్లు తెస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం

- బొప్పరాతి నారాయణ, ఇంటర్‌ విద్యాధికారి

నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టిన్లయితే చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు కళాశాలల్లో ముందస్తుగా అడ్మిషన్లు చేపడితే మా దృష్టికి తీసుకురావాలి. ఇంటర్‌ బోర్డు నుంచి అనుమతి పొందిన తర్వాతే అడ్మిషన్లు చేపట్టాలి. తల్లిదండ్రులు ఇంటర్‌ అడ్మిషన్లపై అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

Updated Date - Mar 11 , 2026 | 12:50 AM