‘సహకారం’ యథాతథం
ABN , Publish Date - May 07 , 2026 | 01:10 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొలువుదీరాయి.
జగిత్యాల, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొలువుదీరాయి. యథావిధిగా పాత పాలకవర్గాలే కొనసాగించాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర స్పెషల్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సొసైటీస్ ప్రసన్న పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘాలకు నామినేటెడ్ లేదా ఎన్నికల ద్వారా కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చింది.
ఫజిల్లాలో 51 సహకార సంఘాలు..
జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 1.5లక్షల మంది సభ్యులున్నారు. పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం గతంలో పొడిగించింది. కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇంకో 3 నెలలకు పైగా వారే కొనసాగారు. ఆరు సంవత్సరాల పాటు ఉన్న పాత పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేస్తూ 2025 నవంబరు మాసంలో నిర్ణయం తీసుకుంది. దీంతో పాత పాలకవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. మూడు రోజుల క్రితం హైకోర్టు పాత పాలకవర్గాలను కొత్త కమిటీలు నియామకం అయ్యే వరకు కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం 2025 డిసెంబరు 19వ తేదీన ఇచ్చిన పాలకవర్గాల రద్దు జీవోను వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సహకార సంఘాల అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటివరకు పర్సన్ ఇన్‌చార్జీలుగా ఉన్న అధికారులు చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలల పాటు మాజీలుగా ఉన్న వారు కోర్టు తీర్పుతో తాజాగా పాత పదవుల్లోనే బాధ్యతలు స్వీకరించారు. ఒక పక్క సహకార సంఘాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగానే పాత పాలక వర్గాలకు పగ్గాలు ఇవ్వడం విశేషం.
ఫజిల్లాల వారీగా డీసీసీబీల ఏర్పాటు యోచన..
కొత్తగా జగిత్యాల జిల్లా ఏర్పాటు అయినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీబీ పరిధిలోనే సహకార సంఘాలున్నాయి. జిల్లాల వారీగా డీసీసీబీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిదంగా పీఏసీఎస్‌లకు నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను ఎన్నుకునే విధంగా యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరు నెలల తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మళ్లీ పాత పాలకవర్గాలనే పునరుద్దరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం..పాత పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది.
ఫపాలకవర్గాల హర్షం...
హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం...వెంటనే అమలులోకి తేవడంతో పీఏసీఎస్ పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పదవుల్లో బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని పలువురు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు అంటున్నారు.
న్యాయపోరాటంతో మళ్లీ బాధ్యతలు
-అయిల్నేని సాగర్‌రావు, పోతారం సింగిల్‌విండో చైర్మన్
న్యాయపోరాటం చేయడం వల్ల పాత పాలకవర్గాలకు మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాలకవర్గాలను రద్దు చేస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కొత్తగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలోని పలు సొసైటీల్లో పాత పాలకవర్గాలు కొత్తగా కొలువుదీరాయి.
ప్రభుత్వ నిర్ణయం మేరకే...
- మనోజ్ కుమార్, జిల్లా సహకార శాఖ అధికారి
పాత పాలకవర్గాలకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జిల్లాలోని అన్ని సొసైటీలకు ఆదేశాలు ఇచ్చాము. ఇప్పటికే పలు పాలకవర్గాల్లో పాతవారు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేకాధికారులు పాత చైర్మన్లు, డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు.