Share News

‘సర్‌’కు సహకరించండి

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:09 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమానికిు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా కోరారు.

‘సర్‌’కు సహకరించండి

కరీంనగర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమానికిు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా కోరారు. సర్‌ కార్యక్రమం అమలులో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్‌ 25 నుంచి జూలై 24వరకు బీఎల్‌వోలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో బీఎల్‌ఏలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. జూలై 24న పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబరు 28 వరకు అభ్యంతరాల పరిష్కారం చేపట్టి అక్టోబర్‌ 1, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. బీఎల్‌వోలు ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతీ ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తారని, ఫారం అందని వారు లేదా పొరపాటున జాబితాలో చేరని అర్హులైన ఓటర్లు గుర్తించి నమోదు చేయించుకునేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లు, ప్రత్యేకాధికారులు నెలరోజులపాటు క్షేత్రస్థాయిలో పని చేస్తారని తెలిపారు. బీఎల్‌వో, బీఎల్‌ఏలకు పూర్తిస్థాయిలో సర్‌ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఓటర్ల మార్పులు, చేర్పుల కోసం ఫారం-8, కొత్త ఓటర్ల నమోదుకు 6ను వినియోగించాలని సూచించారు. సర్‌ కార్యక్రమంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మాస్టర్‌ ట్రైనర్‌ సంపత్‌ రాజకీయ పార్టీల నేతలకు అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, డీఆర్‌వో స్వామి, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:09 AM