మున్సిపల్ రిజర్వేషన్లపై గుబులు
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:13 AM
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించడంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో గుబులు నెలకొంది.
జగిత్యాల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించడంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో గుబులు నెలకొంది. ఈనెల 1న మున్సిపల్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ఇప్పటికే అభ్యంతరాలను అధికారులు ఆహ్వానించారు. ఆయా వార్డుల నుంచి జాబితాలో దొర్లిన తప్పులపై ఆశావహులు, ప్రజలు అభ్యంతరాలు అందించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముసాయిదా ఓటరు జాబితాపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈనెల 10వ తేదీన తుది జాబితా ప్రకటనకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత రిజర్వేషన్లు వెల్లడి కానున్నాయి. తమకు రిజర్వేషన్లు కలిసి వస్తాయా లేదా అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో కేటాయించారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు మార్చే అవకాశం ఉంది.
ఫజిల్లాలో 136 వార్డులు..
జిల్లాలో ఐదుదు మున్సిపాలిటీలు, 136 వార్డులు ఉన్నాయి. ఇందులో జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు, కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులు, మెట్‌పల్లి మున్సిపాలిటీలో 26 వార్డులు, ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులు, రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో 96,410 ఓటర్లు ఉండగా 149 పోలింగ్ స్టేషన్లు, ధర్మపురిలో 14,222 మంది ఓటర్లు ఉండగా 24 పోలింగ్ స్టేషన్లు, రాయికల్‌లో 13,195 మంది ఓటర్లు ఉండగా 24 పోలింగ్ స్టేషన్లు, కోరుట్లలో 63,741 మంది ఓటర్లు ఉండగా 94 పోలింగ్ స్టేషన్లు, మెట్‌పల్లిలో 46,371 మంది ఓటర్లు ఉండగా 64 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఫరిజర్వేషన్లపై రాని స్పష్టత..
మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లలో ఇంకా స్పష్టత రాలేదు. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఆశావహుల్లో నెలకొంది. ప్రస్తుతం రిజర్వేషన్లలో మహిళ, జనరల్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపులో రొటేషన్ పద్ధతి అమలు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. రిజర్వేషన్ కలిసి రాకపోతే జనరల్ స్థానాల్లో పోటీ చేసేందుకు సైతం ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు గెలుపొందారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఫక్షుణ్ణంగా అభ్యంతరాల పరిశీలన..
మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా వచ్చిన అభ్యంతరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటిని సవరించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. మున్సిపాలిటీల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సూచనలు స్వీకరించారు. ఓటర్ల జాబితాపై చర్చించారు. తాజాగా జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వార్డుల్లో ప్రజలు జాబితాపై గందరగోళానికి గురి కావొద్దని మున్సిపల్ కమిషనర్లు ప్రజలను కోరారు. కొంత మంది గ్రామీణ ఓటర్లు పట్టణ జాబితాలో చేరారని అభిప్రాయాలు వచ్చాయి. వీటిని తొలగించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార యంత్రాంగం అంటోంది.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే..
-రాజాగౌడ్, అదనపు కలెక్టర్
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఓటరు జాబితా తయారీపై కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా తయారీ పనులు జరుగుతున్నాయి. రానున్న మున్సిపల్ ఎన్నికలల్లో అవలంబించాల్సిన రిజర్వేషన్లపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్ల కేటాయింపులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.