బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:39 PM
బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు కిరణ్‌కుమార్ అన్నారు.
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు కిరణ్‌కుమార్ అన్నారు. నల్సా రూపొందించిన ‘ఆశ’ మార్గదర్శకాలపై శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (నల్సా) నూతనంగా రూపొందించిన ఆశ-2025 ఆడబిడ్డలకు రక్షణ కవచమని వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాధితులకు తక్షణ సహాయం అందించేలా రూపొందించిన ‘ఆశ’ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, బాధితులకు సపోర్ట్ అందిస్తూ సామాజికంగా అండగా నిలవాలని కోరారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే హెల్ప్‌లైన్ల ద్వారా సమాచారం అందించి, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకునేలా వ్యవస్థను అప్రమత్తం చేయాలని వివరించారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, అలా జరిపించినా లేదా ప్రోత్సహించినా అది కఠినమైన శిక్షార్హమైన నేరమని అన్నారు. బాల్య వివాహాల గురించి 1098(చైల్డ్‌లైన్), 15100(లీగల్ ఎయిడ్) టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. న్యాయ సలహాలు, సూచనలు అవసరం ఉన్న వారు నేరుగా కూడా జిల్లా కోర్టులోని జిల్లా న్యాయ సేవా ఆధికార సంస్థను సంప్రదించి ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాశ్‌రెడ్డి, ప్యానల్ న్యాయవాదులు కీర్తి శ్రీధర్, నాజియా కుతీజా, సమతారాణి, అనూషరెడ్డి, నజియా సుల్తానా, అర్చన, ప్రియాంక, డిఎంసీ శ్రీవాణి, సీఓలు సునీత, మానస, పద్మ, శిక్షణ పాల్గొన్నారు.