చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా
ABN , Publish Date - May 16 , 2026 | 12:07 AM
రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నివారణే ధ్యేయంగా ప్రత్యేక పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.
కరీంనగర్ క్రైం, మే 15 (ఆంధ్రజ్యోతి): రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నివారణే ధ్యేయంగా ప్రత్యేక పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచడంతో పాటు విధుల్లో ఉండే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు, భద్రతా పరికరాలను సమకూ ర్చుతున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ పరిధిలోని ముగ్దుంపూర్ చెక్‌పోస్టును సీపీ గురువారం అర్థరాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ లైట్ రిఫ్లెక్టర్ జాకెట్లు, సరిపడా లైటింగ్ వసతి మినహా మిగిలిన రక్షణ పరికరాల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రతి చెక్‌పోస్టు వద్ద అన్ని రకాల వసతులను అందుబాటులో ఉంచాలని అధికారులను సీపీ ఆదేశించారు. చెక్‌పోస్టుల గుండా వెళ్లే ప్రతి వాహనం, వ్యక్తుల కదలికలను నిరంతరం రికార్డు చేసేందుకు వీలుగా రెండు సీసీటీవీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో సిబ్బంది లైట్ రిఫ్లెక్టర్ జాకెట్లను ధరించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చట్టవిరుద్ధమైన రవాణాకు అడ్డుకట్ట వేసేందుకే తనిఖీలను ముమ్మరం చేసినట్లు సీపీ తెలిపారు.