నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:31 AM
అదనపుతరగతి గదుల నిర్మాణాల్లో వేగం పెంచి 20 రోజులు పూర్తి చేయడంతో పాటు వినియోగంలోకి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): అదనపుతరగతి గదుల నిర్మాణాల్లో వేగం పెంచి 20 రోజులు పూర్తి చేయడంతో పాటు వినియోగంలోకి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా పరీక్షలకు సంసిద్ధులు కావాలని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆమె పరిశీలించారు. పాఠశాలలోని పరిసరాలు, అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనులు, బడిలో విద్యార్థుల సంఖ్య, ఎన్ని తరగతులు ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు అంటే భయపడవద్దని, ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ మార్కులు సాధించాలని అన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. కాగా, బొప్పాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అన్నారు. ఇళ్లు నిర్మాణ పనులు ఎప్పుడు చేపట్టారూ..? ప్రభుత్వ ఆర్థిక సాయం అందిందా..? అని లబ్ధిదారులు మంద స్వరూపను అడిగి తెలుసుకున్నారు. మూడు విడతల్లో రూ.4 లక్షలు తమ ఖాతాల్లో జమ అయ్యాయని స్వరూప పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యం చోటు చేసుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్‌బేగం, గృహా నిర్మాణ శాఖ డీఈ ముజఫర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ సత్యనారాయణరావు, ఎంఈవో కృష్ణహరి, గొల్లపల్లి సర్పంచ్ రమేశ్, ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.