Share News

బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:48 AM

బలహీన వర్గాల రిజర్వేషన్లకు దక్కకుండా కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే రాత్రికి రాత్రి ఓటరు జాబితాను మార్చారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విమర్శించారు. కలెక్టర్‌ పమేలాసత్పతిని కలిసి నగర ఓటరు జాబితాలోని తప్పులను సవరించాలని కోరుతూ మంగళవారం వినతిపత్రం సమర్పించారు.

బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర
కలెక్టరేట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

- ఓటరు జాబితాను మార్చిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసు పెట్టాలి

- ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): బలహీన వర్గాల రిజర్వేషన్లకు దక్కకుండా కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే రాత్రికి రాత్రి ఓటరు జాబితాను మార్చారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విమర్శించారు. కలెక్టర్‌ పమేలాసత్పతిని కలిసి నగర ఓటరు జాబితాలోని తప్పులను సవరించాలని కోరుతూ మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్‌ నగరపాలక సంస్థ అధికారులు తయారు చేసిన ఓటరు జాబితాను మార్చిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పార్టీ అంటే కాంగ్రెస్‌, బీజేపీకి వణుకు పుడుతుందని చెప్పారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాపై రెండు పార్టీలు స్పందించక పోవడంపై వారి ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. తన ఇంటిలోని ఓట్లను తాము నివసిస్తున్న డివిజనలో కాకుండా వేరే డివిజన్లకు మార్చడం వెనుక ఎవరి హస్తముందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఒక ఎమ్మెల్యేకే ఇలా జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓటరు లిస్ట్‌ రూపొందించిన సమయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ వద్ద ఎవరు ఉన్నారు.. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాలు లేకుండా ఈ మార్పులు ఎలా జరిగాయన్నారు. ఎన్నికల కమిషనకు తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు ఎలా జరిగాయన్న విషయాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే కావాలని ఓటరు లిస్టు తప్పుల తడకగా తయారు చేశారని గంగుల కమలాకర్‌ విమర్శించారు. ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరారు. రేపటి వరకు బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే గంగుల అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:48 AM