Share News

కాంగ్రెస్‌ ఢిల్లీలో.. బీజేపీ గల్లీలో..

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:11 AM

జాతీయస్థాయిలో ప్రత్యర్థులైన కాంగ్రెస్‌, బీజేపీ పోటా పోటీ కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ శ్రేణులు చలో ఢిల్లీ అంటూ జాతీయ నిరసనకు తరలివెళ్తుండగా, బీజేపీ హైద్రాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌లలో జరగనున్న పాదయాత్రను విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ ఢిల్లీలో.. బీజేపీ గల్లీలో..

- కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలు

- హస్తినబాట పట్టిన కాంగ్రెస్‌ శ్రేణులు

- నేడు ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో కాంగ్రెస్‌ నిరసన

- ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - విద్రోహులను తరిమికొడదాం పేరిట బీజేపీ పాదయాత్ర

- వేడెక్కిన రాజకీయం

జగిత్యాల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ప్రత్యర్థులైన కాంగ్రెస్‌, బీజేపీ పోటా పోటీ కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ శ్రేణులు చలో ఢిల్లీ అంటూ జాతీయ నిరసనకు తరలివెళ్తుండగా, బీజేపీ హైద్రాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌లలో జరగనున్న పాదయాత్రను విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

పోటా పోటీ కార్యక్రమాలు..

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఢిల్లీ నిరసనను విజయవంతం చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈమేరకు జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి, బీమారం మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాల నుంచి శ్రేణులను తరలించారు. మరోవైపు బీజేపీ సోషల్‌మీడియా నుంచి బయటకు వచ్చి నేరుగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. జిల్లాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు లేకపోవడం పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టింది.

మళ్లీ రాజకీయ ఉద్రిక్తత..

గ్రామపంచాయతీ సర్పంచ్‌ల ఎన్నికల తర్వాత తగ్గిన రాజకీయ ఉద్రిక్తత ‘ఓటు చోరీ’ అంశంతో మళ్లీ వేడెక్కింది. కాంగ్రెస్‌ ఢిల్లీకి శ్రేణులను తరలించి స్థానికంగా ఈ అంశాన్ని చర్చకు తీసుకు రావాలని భావిస్తే, బీజేపీ ఎక్కడికక్కడ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. రెండు పార్టీలు భారీ కార్యక్రమాలు చేపడుతుండడంతో జిల్లాలో మళ్లీ రాజకీయ సందడి కనిపిస్తోంది.

హస్తినబాటలో హస్తం నేతలు...

‘ఓటు బచావో - దేశ్‌ బచావో’ పేరిట ఈనెల 1వతేదీన(ఆదివారం) ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ నిరసనకు జిల్లా నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు తరలివెళ్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌, మేడిపల్లి సత్యం, వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగ్‌రావులు తమ పరిధిలోని సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి ప్రత్యేకవాహనాల్లో నాయకులు బయలు దేరారు. గ్రూపులవారీగా తరలిస్తుండడంతో జిల్లా నుంచి ఎంతమంది పాల్గొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీకి ధీటుగా బీజేపీ ఏర్పాట్లు..

కాంగ్రెస్‌ చేస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో నవంబరు 2వతేదీ నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. హైద్రాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌లలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం-విద్రోహులను తరిమికొడుదాం’ పేరిట భారీ కార్యక్రమాలను నిర్వహించాలని తలపెట్టింది. నవంబరు 2వ తేదీన హైద్రాబాద్‌లోని నిజాం కాలేజ్‌ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి మోజంజాహి మార్కెట్‌ క్రాస్‌రోడ్స్‌ వరకు పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టింది. ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. అదేవిధంగా నిర్మల్‌లో 3వ తేదీన మహాపాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందులో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జీ సునీల్‌బన్సల్‌ పాల్గొననున్నారు. ఉమ్మడిజిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో ఈనెల5వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర జరగనున్నట్లు బీజేపీవర్గాలు ప్రకటించాయి. హైద్రాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌ పాదయాత్రలను విజయవంతం చేయడానికి కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు.

‘ఓటు చోరీ’ని ఎండగడుతాం..

- గాజంగి నందయ్య, డీసీసీ అధ్యక్షుడు, జగిత్యాల

దేశంలో జరుగుతున్న ‘ఓటు చోరీ’ని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రజల్లో ఎండగడుతాం. ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ పిలుపుమేరకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరగనున్న మహానిరసనకు జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల నుంచి ముఖ్యనేతలను తరలిస్తున్నాం. ఎన్‌డీఏ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తాం.

కాంగ్రెస్‌ తప్పుడు ఆరోపణలను తిప్పికొడుతాం..

- డాక్టర్‌ భోగ శ్రావణిప్రవీణ్‌, బీజేపీ రాష్ట్ర నాయకురాలు, జగిత్యాల

కాంగ్రెస్‌ చేస్తున్న అనవసర ఆరోపణలు తిప్పికొడతాం. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం- విద్రోహులను తరిమికొడుదాం’ పేరిట మహాపాదయాత్రలను నిర్వహించడానికి పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. పొరుగు జిల్లాలయిన నిర్మల్‌, కరీంనగర్‌లలో జరగనున్న మహాపాదయాత్రలతో పాటు రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరగనున్న పాద యాత్రను విజయవంతం చేస్తాం.

Updated Date - Nov 01 , 2026 | 01:11 AM