Share News

కాంగ్రెస్‌, బీజేపీ అన్ని అంశాల్లో విఫలమయ్యాయి..

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:28 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, నగరపాలక సంస్థలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు.

కాంగ్రెస్‌, బీజేపీ అన్ని అంశాల్లో విఫలమయ్యాయి..

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, నగరపాలక సంస్థలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ నగరంలో పాలన యంత్రాంగం సరిగా లేక అభివృద్ధి కుటుపడిందని విమర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లలో నెలకొన్న ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌కి, ఇతర అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఫ కాగితాల పడవలు వేసి నిరసన

నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట నిలిచిన వర్షపునీటిలో దోమలు, చెత్తాచెదారం ఉన్నప్పటికీ దాన్ని శుభ్రం చేయడం లేదని, నగరంలో పారిశుధ్య పరిస్థితికి ఇదే అద్దం పడుతోందని బీఆర్‌ఎస్‌శ్రేణులు ఆ నీటిలో కాగితపు పడవలు వేసి నిరసన తెలిపారు. నిత్యం ఇదే ప్రాంతం నుంచి మేయర్‌, కమిషనర్‌, ఇతర అధికారులు, కార్పొరేటర్లు, ప్రజలు వెళ్తున్నా దీన్ని కూడా శుభ్రం చేయడం లేదని విమర్శించారు.

Updated Date - Sep 08 , 2026 | 12:28 AM