Share News

అభ్యర్థుల్లో గుబులు

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:06 AM

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రక్రియ ప్రధాన రాజకీయ పక్షాలు, ఆశావహులను, అధికారుల్లో టెన్షన్‌ పట్టిస్తోంది.

అభ్యర్థుల్లో గుబులు

జగిత్యాల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రక్రియ ప్రధాన రాజకీయ పక్షాలు, ఆశావహులను, అధికారుల్లో టెన్షన్‌ పట్టిస్తోంది. నోటిఫికేషన్‌ ఘట్టం నుంచి పోలింగ్‌ ప్రక్రియ వరకు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న తీరుతో ప్రత్యేక వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో టికెట్ల కేటాయింపు కోసం ప్రధాన పార్టీలు హడావుడి పడుతున్నాయి. కీలక నాయకులతో పాటు ద్వితీయ, శ్రేణి నాయకులు, కార్యకర్తలు గందర గోళానికి గురవుతున్నారు. మరోవైపు టికెట్ల ఆశావహులు నానా హైరానా పడుతున్నారు. అయితే ఎన్నికల ఖర్చు మాత్రం తగ్గుతుందని కొందరు అభ్యర్థులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫపార్టీల్లో మల్లగుల్లాలు..

మున్సిపల్‌ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలన్న ఉద్దేశంతో పార్టీలన్నీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జిల్లాలోని మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలను మాత్రమే జనరల్‌కు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు మహిళలకు కేటాయించడంతో పార్టీ నేతలు తమ సతీమణులను, బంధువులను పోటీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్‌ పీఠాలపై జెండా ఎగురవేయాలని ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఒకరిని మించి ఒకరు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో మున్సిపల్‌ రాజకీయం మరింత వేడెక్కింది.

ఫరెబల్స్‌పై పార్టీల నజర్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన ఆశావహులు బరిలోకి దిగకుండా బుజ్జగించేందుకు పార్టీ నాయకులు హడావుడిగా సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ల కేటాయింపుల సందర్భంగా రొటేషన్‌ పద్ధతి అమలు చేసిన నేపథ్యంలో రిజర్వేషన్లలో కొందరికి పట్టున్న వార్డులు మారాయి. సమయం అత్యంత పరిమితంగా ఉండడంతో పరేషాన్‌ అవుతున్నారు. టికెట్ల విషయానికి వస్తే సర్వేలే ప్రామాణికమని పార్టీలు చెబుతుండడంతో కొందరు ఆశావహులు పార్టీలు మారేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళ్లిన ఆశాశహుల సంఖ్య భారీగానే ఉంది.

ఫ బీ ఫాంలపై ఆశావహుల్లో ఉత్కంఠ

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి సైతం కొద్ది రోజులు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. ఈనెల 27వ తేదీన షెడ్యూల్‌ జారీ తర్వాత వెంటనే నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ సైతం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థులను ఖరారు చేయకముందే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు, 31న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయిన నామినేషన్ల ప్రకటన, వచ్చే నెల 1వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ, 2వ తేదీన అప్పీళ్ల పరిష్కారం, 3వ తేదీన సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. ప్రధాన పార్టీల బీ ఫాంలపై పలువురు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అయిదే పోటీలో ఉండే అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం జోరందుకోనుంది. పోలింగ్‌ వరకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రచార సరళి ఎలా ఉండాలన్న వ్యవహారంపై ప్రణాళికలు రచిస్తున్నారు.

Updated Date - Jan 30 , 2026 | 01:06 AM