Share News

కలకలం

ABN , Publish Date - May 28 , 2026 | 01:10 AM

ఈడీ, డీజీజీఐ సంస్థల సోదాలతో గ్రానైట్‌ వర్గాల్లో కలకలం నెలకొన్నది.

కలకలం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఈడీ, డీజీజీఐ సంస్థల సోదాలతో గ్రానైట్‌ వర్గాల్లో కలకలం నెలకొన్నది. కరీంనగర్‌తోపాటు హైదరాబాద్‌, రాజస్థాన్‌లోనూ ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. ఇటీవల నకిలీ ఇన్వాయిస్‌లు, నకిలీ వేబిల్లులతో పాలిష్‌డ్‌ గ్రానైట్‌ను అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. నకిలీ వేబిల్లులు, ఇన్వాయిస్‌లతో అక్రమ రవాణా చేసిన గ్రానైట్‌ విలువ 100 కోట్లకుపైగా ఉంటుందని గుర్తించిన డీజీజీఐ అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలో 400కుపైగా గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ సంస్థలు హైదరాబాద్‌, రాజస్తాన్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పాలిష్‌డ్‌ గ్రానైట్‌ను విక్రయిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నాయి. గ్రానైట్‌ పరిశ్రమ నష్టాల్లో ఉందంటూ కరోనా తర్వాత అధికారుల దృష్టి ఈ పరిశ్రమ నుంచి మళ్లడంతో ఈ అక్రమ వ్యవహారానికి తెరలేపినట్లు తెలిసింది. నకిలీ వేబిల్లులు, ఇన్వాయిస్‌లతో మరికొన్ని సంస్థలు అక్రమ వ్యాపారం చేసి ఉండే అవకాశాలున్నాయని, వివిధ రాష్ట్రాలకు రవాణా చేసిన గ్రానైట్‌పై అధికారులు దృష్టిసారించి విచారణ జరపాలని నిర్ణయించి బుధవారం దాడులు నిర్వహించారని సమాచారం.

ఫ తప్పుడు కొలతలు, నకిలీ వేబిల్లులు

మొదటి నుంచి గ్రానైట్‌ దిమ్మలను క్వారీ నుంచి తీసి చైనాకు ఇతర దేశాలకు ఎగుమతి చేసే గ్రానైట్‌ సంస్థలు తప్పుడు కొలతలు, నకిలీ వేబిల్లులు, ఇన్వాయిస్‌లు లేకుండానే రవాణా చేయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం పాలిషింగ్‌ యూనిట్లు ఈ అక్రమ వ్యాపారంలో మునిగితేలుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాసరి శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఈ వ్యవహారంలో పట్టుబడడం, ప్రాథమికంగా 100 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో అధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించి లోతుగా దర్యాప్తు చేయాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ సోదాలు చేసినట్లు తెలిసింది. 2018లో గ్రానైట్‌ దిమ్మలను చైనాకు రవాణా చేసే సమయంలో స్థానిక గ్రానైట్‌ సంస్థలు కొలతలు తప్పుగా చూపించి అక్రమ రవాణాచేసినట్లు అధికారులు గుర్తించారు. అప్పుడు ఆ సంస్థలపై స్థానిక న్యాయవాదితోపాటు మరొకరు ప్రధానమంత్రికి, ఆర్థికశాఖ మంత్రి, గనులశాఖ మంత్రికి, ఈడీ, డీజీజీఐ, సెంట్రల్‌ రెవెన్యూ సెక్రెటరీకి పిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం సెంట్రల్‌ రెవెన్యూ సెక్రెటరీ నుంచి కరీంనగర్‌ గ్రానైట్‌ అక్రమాల విషయంలో విచారణ జరపాలని ఈడీ అధికారులకు ఆదే శాలు అందినట్లు సమాచారం. బుధవారం ఈ వ్యవహారంతోపాటు తాజా అక్రమాలపై ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది.

ఫ మరిన్ని తనిఖీలు జరిపే అవకాశం

త్వరలోనే గ్రానైట్‌ క్వారీ అక్రమాలపై ఈడీ, డీజీజీఐ అధికారులతోపాటు మరో ఏడు విభాగాల అధికారులు తనిఖీలు జరిపే అవకాశాలున్నట్లు సమాచారం. బుధవారం కరీంనగర్‌లోని పలు గ్రానైట్‌ పాలీషింగ్‌ యూనిట్లపై ఈడీ, జీఎస్టీ(డీజీజీఐ) అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌తోపాటు ఆయా సంస్థలకు చెందిన హైదరాబాద్‌ కార్యాలయాల్లో వారు లావాదేవీలు నిర్వహించిన రాజస్తాన్‌ వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. నాలుగు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో మైనింగ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ అక్రమ వ్యవహారాలపై దృష్టిసారించడంతో గ్రానైట్‌, సాండ్‌ మైనింగ్‌ చేసే వారిలో కలక లం మొదలైంది.

Updated Date - May 28 , 2026 | 01:10 AM