ఆపత్కాలంలో ధీమా..
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:21 AM
ఆపత్కాలంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే దిశగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఆపత్కాలంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే దిశగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5లక్షల జీవిత బీమా పరిహారం అందించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీమా పథకాన్ని 19న మాజీ ప్రధాని ఇందిరమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. మరుసటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహంచిన ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే(ఎస్‌ఈఈఈపీసీ-2024) ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,92,405 కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు 1.97 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు జీవిత బీమా వర్తింపు చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
పారదర్శకంగా నమోదు ప్రక్రియకు ఏర్పాట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ బీమా పథకంలో గ్రామాలు, పట్టణాల్లో ఏకకాలంలో శిబిరాలు ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి పకడ్బందీగా నిర్వహించే దిశగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని ఆర్‌డీవో, డీఆర్‌డీవో, సీపీవో, డీపీవో, డీసీవో, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలతో ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేసే దిశగా చర్యలు చేపట్టారు. జీవిత బీమా నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసి కుటుంబీకులకు చదివి వినిపించిన తర్వాతే సంబంధిత వ్యక్తి సంతకం తీసుకుంటారు. స్కాన్ కాపీలను బీమా సంస్థకు పంపించడంతోపాటు దరఖాస్తులను జిల్లాస్థాయిలో భద్రపరచనున్నారు. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారి ద్వారా వివరాలు నమోదు చేస్తారు. సంబంధిత అధికారుల పరిశీలన, జిల్లాస్థాయి ఆమోదం అనంతరం బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తారు. అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత రూ.5 లక్షల పరిహారాన్ని నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
డిసెంబరు 19లోపు పూర్తి..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలోని 67 వార్డుల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా ఈనెల 19 ప్రారంభించిన తర్వాత 20 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ ప్రక్రియ డిసెంబరు 19లో పూర్తి చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 1.35 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 1.92లక్షల కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించారు. అర్హులైన కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
కుటుంబంలో ఒకరికే బీమా..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కులం, మతంతో సంబంధం లేకుండా తెలంగాణలోని అన్ని కుటుంబాలకు బీమా పథకాన్ని వర్తింపచేయనున్నారు. రేషన్ కార్డు, లేదా ప్రభుత్వ కుటుంబ సర్వేలో నమోదైన ప్రతి కుటుంబంలోని ఒకరి పేరుతో బీమా సౌకర్యం కల్పిస్తారు. బీమా ఎవరి పేరుతో పొందాలనేది కుటుంబ సభ్యులు నిర్ణయించుకునే విసులుబాటు ఉంది. దీని ద్వారా బీమా పరిహారం అందించే విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయానికి ప్రాధాన్యం ఉంటుంది. బీమా చేయించే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలన్న నిబంధన ఉంది. దీని ప్రకారం 19 నవంబరు 1967 నుంచి 18 నవంబరు 2008 మధ్య పుట్టిన వారు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. బీమా పాలసీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. నమోదు సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్, నామినీ వివరాలు, నామిని ఆధార్ వివరాలు కుటుంబంతో ఉన్న బంధుత్వం, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పూర్తిస్థాయిలో అన్ని వర్గాల కుటుంబాలకు అందించే దిశగా విస్తృతంగా ప్రచారం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులను కూడా రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటి ప్రచారం చేయాలని అధిష్టానం సూచించింది. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్ని కమిటీలు పాల్గొనే విధంగా ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు.
జిల్లాలో మండలాల వారీగా రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు
మండలం కుటుంబాలు
బోయినపల్లి 13,366
చందుర్తి 12,296
గంభీరావుపేట 15,969
ఇల్లంతకుంట 17,431
కోనరావుపేట 15,740
ముస్తాబాద్ 16,748
రుద్రంగి 5,589
సిరిసిల్ల 30,696
తంగళ్లపల్లి 16,173
వీర్నపల్లి 4,835
వేములవాడ 22,303
వేములవాడరూరల్ 8,282
ఎల్లారెడ్డిపేట 17,603
-----------------------------------------
మొత్తం 1,97,031
-----------------------------------------