ఆందోళనలు.. అభ్యంతరాలు..
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:09 AM
సిరిసిల్ల పేరు చెప్పగానే అందరి చెవుల్లో మరమగ్గాల చప్పుళ్లు వినిపిస్తాయి..
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల పేరు చెప్పగానే అందరి చెవుల్లో మరమగ్గాల చప్పుళ్లు వినిపిస్తాయి.. మరోవైపు వేములవాడ రాజన్న క్షేత్రం గుర్తుకు వస్తుంది. అదేస్థాయిలో దేశవ్యాప్తంగా సహకార రంగంలో అగ్ర భాగాన నిలిచిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) కనిపిస్తుంది. రైతులు, నేత కార్మికులు, పారిశ్రామికులు, వ్యాపారులు వినియోగదారులు సెస్ సంస్థకు ఖండాంతరాల ఖ్యాతిని తీసుకొచ్చారు. ఐదున్నర దశాబ్దాలుగా విద్యుత్ సేవలందిస్తూ అనేక దేశాల్లో తన ప్రతిష్టతను చాటుకున్న సెస్ అవినీతి ఆరోపణలు, అవకతవకలు, కొందరి రాజకీయాల కుట్రల మధ్య నిర్వీర్యంగా మారిపోతోంది. సెస్ విద్యుత్తు పంపిణీ లైసెన్స్ రెన్యూవెల్ చేయకుండా ఎన్పీడీసీఎల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సర్కిల్ ఏర్పాటుకు జీవో జారీ చేయడంతో వినియోగదారులు, రైతులకు అందించే విద్యుత్ సేవలకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామసభల్లో సెస్‌ను విలీనం చేయవద్దని, విద్యుత్ సరఫరా బాఽధ్యతలు యథావిధిగా అప్పగించాలంటూ తీర్మానాలు చేశారు. 1970 నుంచి సేవా ప్రస్థానాన్ని ఆరంభించిన సెస్ 3.51 లక్షల మంది సభ్యులతో రూ.252.29 కోట్ల ఆస్తులతో ప్రతి ఏటా రూ.709 కోట్ల బడ్జెట్‌తో అగ్రగామిగా నిలుస్తోంది. అంతటి గుర్తింపు పొందిన సెస్‌కు 2007 సంవత్సరం నుంచి కోట్ల రూపాయల కుంభకోణాల మరకలు అంటించారు. గతంలో అవినీతి చోటుచేసుకుందని అప్పటి పాలకవర్గమే ఒప్పుకొని విచారణ కమిటీ కూడా వేసింది. అదే వరుసలో మారుతున్న ప్రతిపాలకవర్గంలో అవినీతి, అవకతవకలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతూ వచ్చాయి. గత ప్రభుత్వం అవినీతిపై దృష్టి పెట్టలేదని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ పెద్దల సైతం అవినీతిపై ఫిర్యాదులు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై విచారణ జరపకుండా, దోషులను తేల్చాల్సింది వదిలేసి రూ.6.32కోట్ల సభ్యుల వాటాదనంతో సేవలందిస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం నుంచి విద్యుత్తు పంపిణీ బాధ్యతలను తప్పించి సంస్థను నిర్వీర్యం చేసే పనికి పూనుకోవడంపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతులు, వినియోగదారుల నుంచి ఆగ్రహం, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాపాడుకునే దిశగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అవినీతిని నిర్మూలించడం అంటే సెస్ నిర్వీర్యం చేయడమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అవినీతిని నిర్మూలించి యథావిధిగా కొనసాగించాలని రైతులు వినియోగదారులు డిమాండ్ చేస్తూ జేఏసీగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
వీడని అవినీతి... తేలని నిజాలు..
కట్లో వెలుగులు నింపిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో 20 ఏళ్ల క్రితమే అవినీతికి తెరలేచిందనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు.. విచారణలు ఏమి తేలింది.. ఏం జరిగింది.. ఎవరు బాధ్యులయ్యారు.. కోట్లు కాజేశారా.. లేక అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయా.. మన సెస్ భద్రంగానే ఉందా.. అనే సందేహాలు శేష ప్రశ్నలుగానే వినియోగదారుల్లో మిగిలిపోయాయి. సెస్ 2007 నుంచి 2010 వరకు భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అప్పటి పాలక వర్గమే ఒప్పుకుని విచారణ కమిటీని కూడా వేసింది. 2011మార్చిలో అదేక్రమంలో ఉద్యోగుల తప్పిదంగా ఒక ఏడీ, ఇద్దరు ఏఏఈలను సస్పెండ్ చేశారు. మరో డీఈ, ఇద్దరు ఏఈలను మాతృ సంస్థకు పంపించారు. దీంతో సెస్‌లో అవినీతి కలకలం చెలరేగింది. సస్పెన్షన్‌కు గురైన బోయినిపెల్లి ఏఏఈ కంకణాల రాంరెడ్డి మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సెస్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంరెడ్డి మృతదేహంతో సిరిసిల్ల సెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాంరెడ్డి కుటుంబానికి రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆందోళనకు దిగారు. చివరకు పాలకవర్గం దిగిరాక తప్పలేదు. సెస్ పాలకవర్గాన్ని బర్తరఫ్ చేయాలంటూ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా పూనుకున్నారు. చివరకు అవినీతి ఆరోపణలపై విచారణ కమిటీలు వేశారు. కమిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డైరెక్టర్లు కమిటీలో సభ్యులుగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. అప్పుడు ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కేటీఆర్‌ల జోక్యంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. అఖిలపక్ష పార్టీలు కూడా సెస్ అవినీతిపై ఆందోళన చేశారు. అప్పుడు పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న మృత్యుంజయం సెస్‌లో రూ.40కోట్ల వరకు దుర్వినియోగం జరిగిందని సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు సెస్‌లో జరిగిన అవకతవకలపై పలు విచారణ కమిటీలు కూడా వచ్చాయి. సెస్‌లో అనవసరపు కొనుగోళ్లు ఎలాంటి పరిశీలనలు లేకుండానే బిల్లుల చెల్లింపులు జరిగి పోయాయని తేలిపోయింది. చందుర్తి, బోయినపల్లి మండలాల్లో అప్పటి ఎండీ యూనస్ ప్రాథమిక విచారణలోనే ట్రాన్స్‌ఫార్మర్లు, సామగ్రి మాయమైనట్లుగా వెల్లడించారు. అదనపు చెల్లింపులు కూడా జరిగాయని తేల్చారు. దాదాపు ఇరవైకోట్ల వరకు నిధులు పక్కదారి పట్టినట్లుగా ఆరోపణలు ముందుకు వచ్చాయి. దీనిపైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇందులో స్థంభాల కొనుగోలులో బాగా తేడాలు ఉన్నట్లు బయటపడింది. అప్పటి సెస్ పర్సన్ ఇన్‌చార్జి జేసీ అరుణ్‌కుమార్ కూడా సామగ్రి లెక్కల్లో సెస్ స్టోర్‌లో 2006 నుంచి 2007 సంవత్సర కాలంలోనే కోటి రూపాయల వరకు తేడా ఉందని ప్రకటించారు.
సెస్ ప్రగతి పథంలో నడువడానికి రైతుల శ్రమదానం ఎంతో గొప్పది. అలాంటి శ్రమదానానికి విఘాతం కల్పిస్తూ లేబర్ కాంట్రాక్ట్‌కు ప్రతి ఏటా కోట్ల రూపాయల్లోనే అందిస్తున్నారు. 2007-2010 సంవత్సరాల కాలంలో దాదాపు రూ 4కోట్లకు పైగా చెల్లించారు. గతంలో ఎక్కడ స్థంభం నిలబెట్టాలన్న, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలన్న రైతులు శ్రమపడే వరకు అలా శ్రమపడ్డ ఫలితం కోటి రూపాయల వరకు ఉంది. కానీ పాలకవర్గాలు కాంట్రాక్టర్ జేబుల్లోకి శ్రమదానాన్ని నింపారు. ఇదే క్రమంలో అప్పటి పాలకవర్గం హైకోర్టు నుంచి విచారణలపై స్టే తేవడంతో చర్చనీయాంశంగా మారింది. అదే వరుసలో మారిన పాలకవర్గాలు కూడా అవినీతి ఆరోపణల ఎదుర్కొంటోంది. మరోవైపు తాజా పాలకవర్గంలో ఏర్పడిన విభేదాలకు తోడు సంస్థకు కావలసిన సామగ్రి కొనుగోలులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2022 డిసెంబర్‌లో ఏర్పడిన ప్రస్తుత పాలకవర్గంలో విద్యుత్ సరఫరాలో భాగంగా కొనుగోలు చేసిన సామగ్రిలో నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు జరిగాయని, అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి 2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ప్రధానంగా మెటీరియల్ కొనుగోలులో ట్రాన్స్‌పార్మర్లు, ఎర్త్‌పైపులు ఇతర సామగ్రిలో పర్సంటేజీలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. పాలకవర్గంలో డైరెక్టర్ల మధ్య సమన్వయం కూడా లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెస్ ప్రధాన కార్యాలయంలో వాస్తు దోషాల పేరుతో మార్పులు, చేర్పులకు కూడా ఖర్చులు మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
సెస్ విలీనం హర్షణీయం
- సంగీతం శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు
ప్రభుత్వం సిరిసిల్ల సెస్ విలీన నిర్ణయం హర్షనీయం. సెస్‌లో జరుగుతున్న అవకతవక వల్ల ఇప్పటికే సెస్‌తోపాటు సెస్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారు. సెస్ విలీనంతో వినియోగదారులకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఈ నిర్ణయం తీసుకుంటే కోట్ల రూపాయల నష్టం రాకపోవు. ఆలస్యమైనా ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం.
సెస్‌ను తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు..
- తోట ఆగయ్య, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
సిరిసిల్ల ప్రాంతంలో 56 ఏళ్ల కిందట వినియోగదారుల వాటా ధనంతో ఏర్పాటు చేసుకున్న సహకార సంస్థ సెస్. రాష్ట్రంలో సెస్ ఒకటే కొనసాగుతోంది. లక్షతిది కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న సంస్థను ప్రభుత్వం తీసుకోవడానికి రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు. ఎన్‌పీడీసీఎల్ ద్వారా కాకుండా పాలకవర్గం ఆధీనంలోనే సంస్థను కొనసాగించాలి. వినియోగదారులను చైతన్యపరచి సంస్థను కాపాడుకుంటాం.
సెస్ అవినీతిని అరికట్టించేందుకు చర్యలు చేపట్టాలి
- రెడ్డబోయిన గోపి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
సెస్‌ను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేయడం వలన రైతాంగం విద్యుత్ కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సేవలను అందిస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సెస్ పాలకవర్గాన్ని తొలగించి ప్రభుత్వమే సెస్‌ను కొనసాగించాలి.