ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:28 AM
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆనలైన విధానంలోనే కొనసాగుతున్నదని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
జ్యోతినగర్, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆనలైన విధానంలోనే కొనసాగుతున్నదని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. రామగుండం నియోజకవర్గస్థాయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం బుధవారం ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన హాల్‌లో నిర్వహించగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను కంప్యూటర్ ఆధారంగానే ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా విభజించిందన్నారు. ఇంటి స్థలం ఉండి గృహానికి అర్హులైన వారు ఎల్-1లో ఉంటారని, కమిటీ సిఫారస్సుల అనంతరం గెజిటెడ్ అధికారులు పరిశీలించి, మున్సిపల్ కమిషనర్ ద్వారా కలెక్టర్‌కు పంపుతారని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన పరిధిలో ఇప్పటి వరకు 449 మంది ఎల్-1 లబ్ధిదారులకు గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో కేవలం 184 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారని, ధర్మారం ప్రాంతంలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నా రామగుండంలో పురోగతి లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులు సోమవారం విడుదల అవుతాయని, నిర్మాణ పురోగతిని ఆనలైనలో నమోదు చేసిన మేరకు చెల్లింపులు జరుగుతాయన్నారు. ప్రజాప్రతినిధులు అందించిన 1,312 మంది లబ్ధిదారుల జాబితాలో విచారణ అనంతరం 607 మంది ఎల్-1లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎల్-2 కేటగిరిలో ఉన్న సుమారు 700 మందికి ప్రస్తుతం ఇంటి స్థలం లేదని, అయితే స్థలం ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే వారిని ఎల్-1కు మార్చి గృహం మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. 2014కు ముందు మంజూరై పూర్తికాని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మరోసారి సహాయం అందించనున్నట్లు తెలిపారు. గతంలో దరఖాస్తు చేయని అర్హులైన కుటుంబాలు ప్రజాపాలన కేంద్రాల ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్ విస్తీర్ణం 600 చదరపు అడుగులు, స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులకు మించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే బిల్లులు ఆమోదం పొందవని ఆయన హెచ్చరించారు. గుడిసెల్లో వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, గుడిసెలు లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ట్రాన్సజెండర్లతోపాటు పలు వర్గాల్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, తహసీల్దార్ రవీందర్ రావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.