Share News

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:07 AM

చొప్పదండిలోని వంద పడకల ఆసుపత్రిలో పెండింగ్‌ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

చొప్పదండి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): చొప్పదండిలోని వంద పడకల ఆసుపత్రిలో పెండింగ్‌ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండిలోని ఏరియా ఆసుపత్రిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌, తదితర పనులను పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. మండలంలోని రుక్మాపూర్‌లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌, ఎంపీడీవో వేణుగోపాల్‌, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌, ఈఎంటీ బృందం అహ్మద్‌ హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వడ్లూరి సరిత, వైస్‌ చైర్‌పర్సన్‌ పెరుమాండ్ల మానస పాల్గొన్నారు.

ఫ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పెరిగేలా అవగాహన కల్పించాలి

గంగాధర: ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంగాధరలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా ఊరూరా అవగాహన కల్పించాలని, జూనియర్‌ కళాశాల భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం గంగాధర ప్రభుత్వం డిగ్రీ కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ కళాశాల తరగతులను ప్రసుత్తం జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. జూనియర్‌ కళాశాలలో అవసరమైనా ఏర్పాట్లు వారం రోజుల్లో చేయాలని ఆదేశించారు. డిగ్రీ విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్‌ ల్యాబ్‌ తదితర సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం మధురానగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అంబటి రజిత, ఎంపీడీవో రాము, ఇంటర్‌ విద్యాధికారి ఆంజనేయరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాంజనేయ, సర్పంచ్‌ వేముల భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:07 AM