Share News

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:10 AM

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు.

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు, ట్రైనీ పోలీసు సిబ్బంది, వాకర్స్‌తో కలిసి 2కే రన్‌లో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్‌ స్టేడియంలో వాకర్స్‌తో కలిసి పారిశుధ్య పనులు చేపట్టారు. ప్లాస్టిక్‌, గాజు ముక్కల వ్యర్థాలను సేకరించడంతోపాటు కలుపు మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 66 డివిజన్లలో ప్రణాళిక ప్రకారంగా పారిశుధ్య పనులు చేపడతామని తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంతోపాటు డివిజన్లలోని కమ్యూనిటీ భవనాలు, బస్తీ దవఖానాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలన్నింటిని శుభ్రం చేస్తాన్నారు. ప్రతి డివిజన్‌కు 5 లక్షల నిధులు కేటాయించి ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులుచేపడతామని చెప్పారు. మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని, వీధిదీపాలు వెలిగేలా చూస్తామన్నారు. స్వచ్చ సర్వేక్షణ్‌లో కార్పొరేషన్‌కు మెరుగైన ర్యాంకు వచ్చేలా ప్రజలు సహకరించాలని కోరారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని చెప్పారు.

కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎలక్ర్టానిక్‌ వ్యర్థాల సేకరణ ప్రారంభించామన్నారు. ప్రజలు ఇంట్లోని ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలను పరిసర ప్రాంతాల్లో వేయకుండా నగరపాలక సంస్థ కార్మికులకు అందించాలని సూచించారు.

సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్‌ 2 వరకు 99 రోజుల కార్యాచరణతో ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.

Updated Date - Mar 10 , 2026 | 12:11 AM