Share News

అర్ధరాత్రి కలకలం..

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:58 PM

కరీంనగర్‌లో మరో భారీ దోపిడి జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భగత్‌నగర్‌ చౌరస్తాలోని అజ్మత్‌అలీ ఇంటిలో దోపిడి దొంగలు చొరబడ్డారు.

అర్ధరాత్రి కలకలం..

కరీంనగర్‌ క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో మరో భారీ దోపిడి జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భగత్‌నగర్‌ చౌరస్తాలోని అజ్మత్‌అలీ ఇంటిలో దోపిడి దొంగలు చొరబడ్డారు. ఇంటి యజమాని అజ్మత్‌తోపాటు కుటుంబ సభ్యులను తాళ్లతో బంధించిన దుండగులు వెంటతెచ్చుకున్న తుపాకులు, కత్తులతో బెదిరించి, కొట్టి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పారిపోయారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే... భగత్‌నగర్‌ చౌరస్తాలో అజ్మత్‌అలీకి 10 వరకు షటర్లు ఉండగా పై అంతస్థులో ఒక పోర్షన్‌లో ఆయన నివసిస్తున్నారు. మిగతా ఆరు పోర్షన్లు అద్దెకు ఇస్తుంటాడు. అజ్మత్‌ అలీ, అతని భార్య, ఇద్దరు కూతుళ్లు ఇంటిలో ఉంటున్నారు. చౌరస్తాకు అతి సమీపంలో ఇళ్లు ఉండడంతో అర్ధరాత్రి వరకు వాహనాల రాకపోకలతో అలికిడిగా ఉంటుంది. పడుకునే ముందు రాత్రి 12 గంటల సమయంలో ప్రతి రోజు ఇంటి ముందు లైట్లను ఆర్పివేసేందుకు ఇంటి యజమాని అజ్మత్‌ అలీ వెళుతుంటాడు. ఎప్పటి మాదిరిగానే అజ్మత్‌ అలీ మంగళవారం రాత్రి 12 గంటలకు మొదటి అంతస్థు నుంచి కిందకు దిగారు. అప్పటికే మెట్ల వద్ద నక్కి ఉన్న ఎనిమిది మంది దుండగులు అతడిని పట్టుకుని తాళ్లతో బంధించి పైపోర్షన్‌కు తీసుకువెళ్లారు. అజ్మత్‌ భార్య మహమూదాబేగం, కూతుళ్లు సాజిదాభాను, అఫ్రిన్‌ను తాళ్లతో బంధించి, అరవకుండా నోటికి గుడ్డ చుట్టారు. అడ్డుకోబోయిన అజ్మత్‌ అలీ, కూతురు సాజిదా భానును కత్తితో ముఖంపై గాయపరిచారు. టీవీ సౌండ్‌ పెంచి సెల్‌ఫోన్లను లాక్కున్నారు. నేరుగా బెడ్‌రూంలోకి వెళ్లి బీరువాలో ఉన్న 54 తులాల బంగారం, 30 తులాల వెండి, 25 లక్షల నగదు దోచుకుని ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంటి ఆవరణలో పార్క్‌ చేసి ఉన్న రెండు బైక్‌లను తీసుకుని వాటిపైనే పారిపోయారు. నిందితులు తీసుకువెళ్లిన ఒక సెల్‌ ఫోన్‌ను భగత్‌ నగర్‌ ప్రాంతంలో పోలీసులు రికవరీ చేశారు. ఒక డమ్మీ తుపాకిని సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముఖాలకు ముసుగులు చేతులకు గ్లౌజులు ధరించి ఈ దాడికి దోపిడికి పాల్పడ్డారు.

ఫ అల్లుడిపైనే అనుమానాలు

అజ్మత్‌ అలీ కుటుంబానికి తెలిసిన వారే ఈ దోపిడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అజ్మత్‌అలీ కుమార్తె సాజిదాభానుకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రజావుద్దీన్‌తో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య గొడవలు జరగడంతో సాజిదాఽభాను కరీంనగర్‌కు వచ్చారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు నచ్చజెప్పడంతో రజావుద్దీన్‌, సాజిదాభాను కరీంనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించారు. మళ్లీ వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. జూన్‌ 17న రజావుద్దీన్‌ తన ప్లాట్‌లోని సామగ్రి, టీవీ, కారును తీసుకుని పరారయ్యాడని సాజిదాభాను నెల రోజుల క్రితం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి రజావుద్దీన్‌ ఆచూకీ తెలియడం లేదు. దోపిడీ జరిగిన సమయంలో నిందితులు నేరుగా అజ్మత్‌ అలీ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను బంధించి బంగారు ఆభరణాలు, నగదు ఉన్న గదిలోకి నేరుగా వెళ్లి దోచుకోవడంబట్టి చూస్తే తెలిసిన వారి సమాచారంతోనే దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అజ్మత్‌ అలీ ప్రతిరోజు రాత్రి 12 గంటలకు బయటకు వచ్చి లైట్లు ఆర్పివేస్తారనే విషయం కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దొంగలు మీరట్‌ యాసలోనే మాట్లాడారని, రజావుద్దీన్‌పైనే తమకు అనుమానాలున్నాయని బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. బాధితుడు అజ్మత్‌ అలీ నుంచి ఫిర్యాదు స్వీకరించిన వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫ నిందితులను త్వరగా పట్టుకుంటాం

- సీపీ గౌస్‌ ఆలం

దోపిడి జరిగిన సంఘటనా స్థలాన్ని సీపీ గౌస్‌ ఆలం సందర్శించి బాధితుడు అజ్మత్‌ అలీ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దోపిడి ఘటనలో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అజ్మత్‌ అలీ కుటుంబ సభ్యులకు తెలిసిన వారే ఈ దోపిడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని, దుండగులు చోరీ చేసిన రెండు బైక్‌లపై ఐదుగురు బైపాస్‌రోడ్‌లో వెళుతున్నట్లు వెల్లడైందన్నారు. బాధితులు మాత్రరం ఎనిమిది మంది దుండగులు ఉన్నట్లు చెబుతున్నారని, దీనిపై విచారణ జరుపుతున్నామని సీపీ గౌస్‌ ఆలం తెలిపారు.

ఫ ఆయుధాలతో చెలరేగుతున్న దోపిడి దొంగలు

కరీంనగర్‌లో కొద్ది రోజులుగా దోపిడి దొంగలు చెలరేగుతుండడం సర్వత్రా ఆందోళనలకు గురి చేస్తోంది. మే3న పీఎంజే జ్యూవెలర్స్‌లో ఐదుగురు దుండగులు ఆయుధాలతో చొరబడి అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి కోటిన్నర వరకు బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. ఈ ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో అజ్మీత్‌ అలీ ఇంటిలోకి ఎనిమిది మంది తుపాకులు, కత్తుల వంటి మారణాయుధాలతో చొరబడి దోపిడికి పాల్పడడంంకలకలం రేపుతున్నది.

ఫ నామమాత్రపు గస్తీ...

కరీంనగర్‌లో రాత్రి వేళ గస్తీ నామమాత్రంగానే ఉంటుందని ప్రజలు విమర్శిస్తున్నారు. అర్ధరాత్రి వేళ రోడ్లపైనే బర్త్‌ డే వేడుకలు, బైపాస్‌ రోడ్లపై బైక్‌ రేసులు విచ్చలవిడిగా నడుస్తున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు.

ఫ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు..

దోపిడికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు సీపీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిందితులు పట్టుకుపోయిన ఫోన్‌ లొకేషన్‌, బైక్‌ల ఆచూకీ కోసం సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటన స్థలంలో ఒక డమ్మీ తుపాకి, సెల్‌ఫోన్‌ పోలీసులకు లభ్యమైంది. ఈ రెండింటిపై వేలి ముద్రలను సేకరించిన క్లూస్‌ టీం పోలీసులు పాత నేరస్థుల వేలిముద్రలతో పోల్చిచూస్తున్నారు. మరో వైపు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయగా బైపాస్‌రోడ్‌ వరకు వెళ్లినట్లు తెలిసింది. అజ్మత్‌అలీ అల్లుడు రజావుద్దీన్‌పై ఉత్తరప్రదేశ్‌లో హత్య కేసు, అతని కుమారుడిపై మారణాయుధాల కేసు ఉన్నాయని సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి వాసాల సతీష్‌, టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, రూరల్‌ ఏసీపీ విజయకుమార్‌, సిఐలు రామచందర్‌రావు, పుల్లయ్య సందర్శించారు. బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.

Updated Date - Jul 22 , 2026 | 11:58 PM