Share News

ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:09 AM

ధాన్యం విక్రయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది.

 ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం

పెద్దపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ధాన్యం విక్రయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇటీవలి వరకు పచ్చివడ్లకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు అనంతరం ధరలు తగ్గిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తూకంలో తరుగు, గోనె సంచుల కోత, నాణ్యత పేరుతో ధర తగ్గించడం వంటి సమస్యలు ఎదు రవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు న్యాయం చేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఫ 300కు పైగా కేంద్రాల ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 244, ఐకేపీ ద్వారా 60కి పైగా, హాకా ఆధ్వర్యంలో మరో నాలుగు కేంద్రా లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 300కు పైగా కేంద్రాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రామాలకు సమీ పంలోనే కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేకుండా చూడ టంతో పాటు, పంట కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికా రులు ప్రణాళిక రూపొందించారు.

ఫఅన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టార్పాలిన్లు, గోనె సంచులు, తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలు, ప్యాడీ క్లీనర్లు, తాగు నీరు, హమాలీలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షం వచ్చినా ధాన్యం తడవకుండా కవర్లు ఏర్పాటు చేయడంతో పాటు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా సదుపా యాలు కల్పించాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది.

ఫ పచ్చి వడ్లకు తగ్గిన ధర

వరి కోతలు మొదలైన సమయంలో జిల్లాలో పచ్చి వడ్లకు మంచి డిమాండ్‌ కనిపించింది. ట్రేడర్లు, మిల్లర్లు, మధ్యవర్తులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి ధాన్యం కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. పచ్చి వడ్ల ధరలు తగ్గడంతోపాటు, తేమ శాతం, నాణ్యత, తరుగు పేరుతో రైతులకు చెల్లించే మొత్తంలో కోతలు విధిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోనె సంచుల పేరుతోనూ అదనపు కోతలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తు న్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించే అవకాశం ఏర్పడింది. అయితే కేంద్రాల్లో కొనుగోళ్లు వేగంగా జరగడం, ధాన్యం విక్రయించిన వెంటనే తూకం, నాణ్యత వివరాలను పారదర్శకంగా నమోదు చేయడం, రైతులకు సకాలంలో చెల్లింపులు జరగడం కీలకం కానుంది.

ఫ గత ఖరీఫ్‌లో 333 కేంద్రాలు

2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 333 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లోనూ పంట దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గత యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పెద్ద ఎత్తున సాగగా, పెద్దపల్లి జిల్లా నుంచి సుమారు 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సీజన్‌లో 2.15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 4.49 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

- ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దకల్వల, తుర్కలమద్దికుంటలో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులు ధర తగ్గించి రైతులను ఇబ్బంది పెడుతుండడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. రైతుకు బయట అధిక ధర వస్తే అక్కడ కూడా అమ్ముకోవచ్చన్నారు. కొనుగోలు కేంద్రాలలో క్వింటాలకు 2462 రూపాయల మద్దతు ధరతో 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్‌ అందిస్తుందన్నారు. తూకంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. తుఫాను ప్రభావం ఉందని రైతులు పంటలు కోసిన తర్వాత పాలిథిన్‌ కవర్లు కప్పుకోవాలని సూచించారు. ఎల్‌నినో కారణంగా రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌ ముత్యాల నరేష్‌, మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి సుధాకర్‌రెడ్డి , సర్పంచ్‌ నర్ల కనుకమ్మ-పోల్‌రాజు, మాజీ సర్పంచ్‌ కారెంగల రమేష్‌, అర్కుటి సంతోష్‌, రాజేందర్‌, ఆడెపు వెంకటేషం,రాజయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 01:09 AM