Share News

ముస్తాబవుతున్న కలెక్టరేట్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 01:13 AM

కొత్త కలెక్టరేట్‌ పార్రంభోత్సవానికి ముస్తాబవుతోంది.

ముస్తాబవుతున్న కలెక్టరేట్‌

- ముమ్మర ఏర్పాట్లలో యంత్రాంగం

- శరవేగంగా చివరి దశ పనులు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

కొత్త కలెక్టరేట్‌ పార్రంభోత్సవానికి ముస్తాబవుతోంది. సకల హంగులతో నిర్మితమైన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదుకు అధికారయంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్‌ చిత్రామిశ్రాతోపాటు అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ వాఖడే, డీఆర్వో స్వామితోపాటు ఆయా విభాగాల అధిపతులు వివిధ పనుల పర్యవేక్షణలో తలమునకలయ్యారు. చిన్నపాటి పనులు పెండింగ్‌లో ఉండడంతో వాటిని పూర్తి చేయిస్తున్నారు. ముఖ్యంగా లైటింగ్‌ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయిస్తున్నారు. గార్డెనింగ్‌ పనులతోపాటు కొన్ని కార్యాలయాలను ఇంటీరియర్‌ డిజైన్లతో తీర్చిదిద్దుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చిన వివిధ విభాగాల కార్మికులు వారికి అప్పగించిన పనుల్లో బిజీబిజీగా కనిపిస్తున్నారు. రేయింబవళ్లు శ్రమిస్తూ ఇక్కడి పనులను చకచకా పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఫ ప్రధాన ద్వారం.. హెలిప్యాడ్‌..

పాత కలెక్టరేట్‌ ఆవరణ రూపురేఖలు మొత్తంగా మారిపోయాయి. 51 కోట్లతో సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన కలెకరేట్‌ భవనం ప్రజలకు సేవలందించేందుకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలతో కొలువుదీరనుంది. ఇప్పటి వరకున్న పాత భవన ప్రధాన ద్వారం స్థానంలో కొత్తగా ఉత్తరం దిశగా నూతనంగా ఆర్చీని ఏర్పాటు చేశారు. వెడల్పాటి సీసీ రోడ్డును నిర్మించారు. పీఎఫ్‌ ఆఫీస్‌ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మీదుగా కలెక్టరేట్‌కు రాకపోకల్ని సాగించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతిమ మల్టీప్లెక్స్‌ నుంచి భగత్‌నగర్‌ వెళ్లే దారిలో పడమర దిక్కున రెండు ద్వారాలతో గేట్లు ఉండేవి. కొత్త కలెక్టరేట్‌కు వెళ్లేందుకు అందులో ఒక ద్వారాన్ని మాత్రమే వినియోగించనున్నారు. మరోవైపు కొత్త కలెక్టరేట్‌ వెనుకాల ఉన్న హెలిప్యాడ్‌ వద్ద అవసరమైన మరమ్మతులు చేశారు. కొత్తగా రోడ్డును వేశారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రధాన రహదారులకు ఇరువైపులా విద్యుత్తు తీగలకు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. రోడ్డుకిరువైపులా ప్రహరీలకు రంగులను వేసి ఆకర్షణీయంగా ప్రాంగణ పరిసరాల్ని తీర్చిదిద్దుతున్నారు. కలెక్టరేట్‌ మధ్యలో ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన గార్డెనింగ్‌ను పచ్చిక బయళ్లతో తీర్చిదిద్దారు. కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ మొదలు భవనం ఎదుటి భాగాల్లో విద్యుత్‌ దీపాలు, రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు.

ఫ ఆకట్టుకునేలా.. గ్రౌండ్‌ ఫ్లోర్‌..!

కొత్త కలెక్టరేట్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పలు గదులు, ఛాంబర్‌లను ఆకట్టుకునే విధంగా రూపొందించారు. సీఎం ఈ ఫ్లోర్‌లోనే కలెక్టర్‌ ఛాంబర్‌లోకి వెళ్లి బాధ్యతలను అప్పగించనుండడంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్లో కలెక్టరేట్‌ సిబ్బంది హాల్‌తోపాటు సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్‌ రూమ్‌, కలెక్టర్‌ కార్యాలయ గదిని అన్నిరకాల వసతులతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. గదుల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. సమవేశ మందిరంలో సౌండింగ్‌ సిస్టమ్‌, ఫర్నీచర్‌ను సమకూర్చే పనుల్ని చకచకా చేపడుతున్నారు. మొదటి రెండు అంతస్తుల్లో అన్నిరకాల సౌకర్యాలను కల్పించినప్పటికీ అక్కడి గదులను ఆయా శాఖలకు ఇంకా కేటాయించలేదు. రెవెన్యూ విభాగానికి సంబంధించినవి మాత్రం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత ఆయా శాఖలకు పై అంతస్తులో ఉన్న గదులను కేటాయిస్తారు. ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడటం వల్ల వీటి కేటాయింపును వాయుదా వేశారు. మరో 24 గంటల్లో కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండటంతో కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Sep 29 , 2026 | 01:13 AM