Share News

జలుబు.. దగ్గు.. జ్వరం..

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:18 AM

- సెప్టెంబరు 1 నుంచి ఈ నెల 6 వరకు జిల్లా ఆసుపత్రికి 41,167 మంది ఔట్‌ పేషెంట్‌లుగా వచ్చారు. ఇందులో 35 వేలకుపైగా జ్వరపీడితులే.. ఇందులో వైరల్‌ లక్షణాలు అధికంగా ఉన్న 4,637 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు.

జలుబు.. దగ్గు.. జ్వరం..

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

- సెప్టెంబరు 1 నుంచి ఈ నెల 6 వరకు జిల్లా ఆసుపత్రికి 41,167 మంది ఔట్‌ పేషెంట్‌లుగా వచ్చారు. ఇందులో 35 వేలకుపైగా జ్వరపీడితులే.. ఇందులో వైరల్‌ లక్షణాలు అధికంగా ఉన్న 4,637 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు.

- కరీంనగర్‌ కార్పొరేషన్‌లోనే ఈసారి 18 డెంగీ కేసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన ఆనవాళ్లున్న ప్రాంతాలను గుర్తించి ఫాగింగ్‌తోపాటు నిల్వ నీటిని తొలగించే ప్రయత్నాలు చేశారు. బ్లీచింగ్‌ చల్లారు. లార్వా వృద్ధికాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మిగతా గ్రామాల్లో కలిపి మరో 29 డెంగీ కేసులున్నట్లు గుర్తించారు.

పల్లె, పట్టణం విషజ్వరాలతో వణుకుతోంది. జిల్లావ్యాప్తంగా రోగులు జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. దగ్గు, జలుబులతో సతమతమవుతున్నారు. కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి వచ్చిన వారిలో చాలామంది ఆస్పత్రిలో అడ్మిట్‌ అవుతున్నారు. కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులూ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇన్‌పేషెంట్లుగా చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆస్పత్రులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటూ మెడికల్‌ షాప్‌ల నుంచి మాత్రలు తెచ్చుకుని వాడుతున్న వారు కూడా అధికంగానే ఉన్నారు. గత నెల ఆఖరివారంలో వర్షాలు పడిన తర్వాత విపరీతమైన ఎండ కొడుతుండడడంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. అధికారికంగా జిల్లా ఆసుపత్రికి వచ్చిన బాధితుల్లో డెంగీ లక్షణాలున్న వారిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. అనధికారికంగా ప్రైవేటు ఆస్పత్రిలో డెంగీ లక్షణాలు, ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని చికిత్స తీసుకుంటున్న వారు వందల సంఖ్యలోనే ఉన్నారు. సర్కారు దవాఖానాకు వెళ్లడం ఇష్టంలేని వారంతా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

మూడేళ్లుగా డెంగీ కేసులు

-------------------------

సంవత్సరం డెంగీకేసులు

--------------------------

2024 186

2025 97

2026 47

--------------------------

ఫ పడకేసిన పారిశుధ్యం..

గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు రోడ్లపై పారుతుండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని శివారు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని చోట, ఓపెన్‌ ప్లాట్లలో పెద్ద పెద్ద మురికి కుంటలు ఏర్పడుతున్నాయి. తాగిపడేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లలో నిలిచిన నీళ్లనుంచి పుట్టిన దోమల వల్ల డెంగీ ప్రమాదం పొంచి ఉంది. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న వారిలో ఎక్కువ మందిని దగ్గు ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడినా ఆ తర్వాత ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తోంది. చిన్నారులు, వృద్ధులు త్వరగా జ్వరాల బారిన పడుతున్నారు. ఈసారి ముందస్తుగా వ్యాధుల నివారణ దిశగా యంత్రాంగం పక్కాగా చర్యల్ని తీసుకోవడంలో విఫలమయిందనే చెప్పాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న చోట శిబిరాల నిర్వహణ పక్కాగా చేపట్టడం లేదు. గత ఏడాది నిర్వహించినట్లు ఇంటింటి జ్వర సర్వేను ఈ సారి చేపట్టలేదు. డెంగీ కేసులు రెండేళ్లతో పోలిస్తే తగ్గినా జ్వర బాధితుల సంఖ్య ఈసారి పెరిగింది.

Updated Date - Oct 07 , 2026 | 01:18 AM