పురుగులు పడుతున్న దొడ్డు బియ్యం
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:46 AM
జిల్లాలోని రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ఏడాది కాలంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు. దీంతో బియ్యం పురుగు పట్టి ముక్కిపోతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలోని రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ఏడాది కాలంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు. దీంతో బియ్యం పురుగు పట్టి ముక్కిపోతున్నాయి. సుమారు 2 కోట్ల 20 లక్షల రూపాయల విలువైన బియ్యం ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రేషన్ వినియోగదారులకు సన్నబియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులు సన్నరకం ధాన్యాన్ని సాగు చేసే విధంగా క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. ధాన్యం ప్రభుత్వానికి చేరిన తర్వాత 2025 ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తు న్నది. అయితే అప్పటి వరకు రేషన్ షాపుల్లో మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వెనక్కి తెప్పించుకోలేదు.
జిల్లాలో 413 రేషన్‌షాపులు ఉండగా అం దులో దొడ్డు బియ్యం 6,460 క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయి. వాటిని నిల్వ చేసేందుకు స్థలం లేక రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా సరైన చర్యలు తీసుకోక పోవడంతో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం వృథా అవుతుండగా, అదే షాపుల్లో నిల్వ చేస్తున్న సన్న బియ్యానికీ పురుగు సోకే ప్రమా దం ఏర్పడింది. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లోనే మగ్గుతున్నట్లు సమాచారం. ఆ బియ్యం ప్రజలు తినేందుకు పనికి రావని చెబుతున్నారు. ఇతరత్రా అవసరా లకు వినియోగించేందుకు టెండర్లు వేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఫ సన్నబియ్యానికి ముప్పు..
ప్రస్తుతం ప్రతీ నెలా పంపిణీ కోసం వస్తున్న సన్న బియ్యాన్ని కూడా ఇదే రేషన్ షాపుల్లో నిల్వ చేస్తున్నారు. పురుగు పట్టిన దొడ్డు బియ్యం పక్కనే సన్న బియ్యం బస్తాలను ఉంచాల్సి రావ డంతో వాటి నాణ్యత కూడా దెబ్బతింటోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు బియ్యం బస్తాలు షాపుల్లోనే ఉండిపోవడంతో కొత్త బియ్యం నిల్వ చేసేందుకు స్థలం సరిపోవ డం లేదు. కొన్ని దుకాణాల్లో బస్తాలను ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. దీంతో నిర్వహణ కూడా భారంగా మారింది. పంపిణీకి పనికిరాని స్థితికి చేరుతున్న ఈ బియ్యం వల్ల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి నిరుపయోగంగా మారుతోంది. ఒకవైపు ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అం దించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు పాత నిల్వలను పట్టించుకోక పోవ డంతో ప్రజాధనం వృథా అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ తక్షణమే తరలించాలి..
జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న 6460 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని, ప్రత్యామ్నాయ వినియోగా నికి తరలించాలని డీలర్లు, వినియోగదారులు కోరుతున్నారు. లేదంటే సన్న బియ్యం నాణ్యత దెబ్బతినడంతోపాటు ప్రభుత్వానికి ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి శ్రీనాఽథ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, జిల్లాలో 6460 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని, దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. వాటిని తరలించే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు.