నిలిచిన సీఎంఆర్ అన్‌లోడింగ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:49 AM
జిల్లాలోని పలు గోదాముల వద్ద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లారీలు పెద్దఎత్తున నిలిచిపోయాయి
జగిత్యాల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు గోదాముల వద్ద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లారీలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. వరి ధాన్యాన్ని మరాడించి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి అప్పగించడానికి రైస్‌మిల్లర్లు పంపిన సీఎంఆర్ అన్‌లోడ్ చేయడానికి అదనపు వసూళ్లు, హమాలీ చార్జీలు, బియ్యం తూకంలో కటింగ్‌లు చేయడం పెద్ద సమస్యగా మారింది. గోదాములలో సరియైున స్థలం లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం, వసూళ్లు దీనికి ప్రధాన కారణ మవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వం అద్దెకు తీసుకున్న పలు ప్రైవేటు గోదాముల నిర్వాహకులు తమ గోదాముల్లో బియ్యం అన్ లోడ్ చేయడానికి క్వింటాలుకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి మిల్లర్లు సుముఖంగా లేకపోవడంతో గోదాముల వద్ద రోజుల తరబడి లారీలు నిలిచిపోతున్నాయి. దీంతో ఇటు మిల్లర్లు, లారీలను అద్దెకు ఇచ్చిన యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 వరకు బియ్యం లారీలు అన్‌లోడింగ్ చేయకపోవడంతో నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ఫగోదాంల వద్ద అక్రమ వసూళ్లు...?
జిల్లాలోని జగిత్యాల డివిజన్‌లో గల పలు ప్రయివేటు గోదాంల వద్ద సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఎఫ్‌సీఐ గోదాంలలో ఒక్కో లారీ బియ్యాన్ని అన్‌లోడ్ చేయడానికి హమాలీ పేరిట రూ.4 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేసేవారని అంటున్నారు. దీనికి తోడు వే బ్రిడ్జిల వద్ద ఒక్కో లారీ బియ్యానికి సుమారు ఒక క్వింటాలు వరకు అదనపు తూకం విధిస్తున్నట్లు పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల సంబంధిత గోదాంల వద్ద సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు హమాలీ పేరిట చేస్తున్న వసూళ్లు, బియ్యంలో అదనపు తూకం, మాముళ్లు పెంచడంతో వివాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ప్రతీ యేటా గోదాంల వద్ద ఇలా వసూళ్లు చేస్తున్న డబ్బులు రూ.లక్షల్లో ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫ జిల్లాలో 30 ప్రైవేటు గోదాములు
జిల్లాలోని పలు ప్రైవేటు గోదాముల నిర్వాహకులు, సిబ్బంది మరియు రైస్ మిల్లర్ల మధ్య మాముళ్ల వివాదం తలెత్తింది. ఇటీవల పెంచిన అదనపు డబ్బులు ఇవ్వబోమని మిల్లర్లు తేల్చి చెప్పడంతో గోదాం నిర్వాహకులు ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యాన్ని తీసుకొచ్చిన లారీలను అన్‌లోడ్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, బుగ్గారం, జగిత్యాల రూరల్ తదితర మండలాల్లో గల ప్రభుత్వ అద్దెలో ఉన్న ప్రైవేటు గోదాంల వద్ద వందల సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. మూడు, నాలుగు రోజులుగా పెద్దఎత్తున లారీలు నిలిచిపోవడం, సీఎంఆర్ డెలివరీపై ప్రభావాన్ని చూపింది. జిల్లాలో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేయగల సామర్థ్యంతో 30వరకు ప్రైవేటు గోదాములు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో ఒక్కటి గోదాం, మల్యాల మండలం బల్వంతపూర్‌లో రెండు గోదాంలు, ఇస్రాజుపల్లిలో ఒక్కటి, బుగ్గారం మండలం యశ్వంతరావుపేట వద్ద రెండు ప్రైవేటు గోదాములున్నాయి. వీటిల్లో కొన్నింటి వద్ద మాముళ్ల వివాదం తలెత్తి సీఎంఆర్ బియ్యం అన్‌లోడింగ్ నిలిచిపోయింది.
ఫదృష్టి సారించిన అదనపు కలెక్టర్
జిల్లాలో గోదాం నిర్వాహకులు, రైస్ మిల్లర్ల మద్య ఏర్పడిన వివాదం, నిలిచిపోయిన సీఎంఆర్ బియ్యం అన్‌లోడింగ్ పరిస్థితిపై అదనపు కలెక్టర్ బీఎస్ లత దృష్టి సారించారు. తాజాగా కలెక్టరేట్‌లో ఇరు వర్గాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్ష జరిపినట్లు సివిల్ సప్లయి శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే సమస్య శాశ్వత పరిష్కారం కాలేదని, తాత్కాలికంగా సద్దుమణిగేలా అధికారులు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ బియ్యం అన్‌లోడింగ్‌కు గోదాంల వద్ద రైస్ మిల్లర్లు ఎలాంటి హమాలీ చార్జీలు, నిర్వహణ చార్జీలు, తూకంలో అదనంగా బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని రైస్ మిల్లర్లు అంటున్నారు. గోదాముల నిర్వాహకులు అవినీతికి పాల్పడుతున్నారని పలువురు రైస్‌మిల్లర్లు ఆరోపిస్తున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలని రైస్ మిల్లర్లు కోరుతున్నారు.