సీఎంఆర్ హాంఫట్
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:24 AM
అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ధాన్యం కొనుగోలు చేస్తోంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ధాన్యం కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు కేటాయిస్తుంటారు. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కింద ప్రభుత్వానికి బియ్యాన్ని అందించాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొందరు మిల్లర్లు పైసా పెట్టుబడి లేకుండా సర్కార్ అందించిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా ప్రభుత్వానికి అప్పగించకుండా మాయ చేస్తున్నారు. సీఎంఆర్ బియ్యాన్ని మింగేస్తున్న మిల్లర్లలో మరికొందరు ఏకంగా ధాన్యాన్ని మాయం చేసే పరిస్థితికి వచ్చింది. ఇటీవల ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోలులో భారీ అవకతవకలు బయటపడ్డాయి. తాజాగా జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ నరసింహారెడ్డిని సస్పెండ్ చేశారు. జిల్లా మేనేజర్‌గా గోపాల్‌ను నియమించారు. గురువారం ఆయన విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందే ధాన్యం కొనుగోలు వ్యవహారంలో యాసంగి ధాన్యం దారి మళ్లింపు వ్యవహారంలో 10 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. జిల్లాలో యాసంగిలో 3.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో యాసంగిలో 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,79,650 దొడ్డు రకం, 7,539 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీని ద్వారా 4 లక్షల 56 వేల 664 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం 4 లక్షల 49 వేల 125 మెట్రిక్ టన్నులు, సన్న రకం 7539 మెట్రిక్ టన్నులు వస్తుందని. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 2.97 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం దాన్యం, 7,539 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కొనుగోలు చేశారు. పౌరసరఫరాల శాఖ ద్వారా 53,704 మంది రైతుల నుంచి 3.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 3,75,345 దొడ్డు రకం దాన్యం, 631 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలులో ఐకేపీ ద్వారా 1,96,268 మెట్రిక్ టన్నులు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 1,67,303 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 9,043 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 3,361 మెట్రిక్ టన్నులు కొనుగొలు చేశారు. ఇందులో అక్రమంగా ట్రక్ షీట్లు సృష్టించి 13 లారీల ధాన్యం పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు ధాన్యం దారి మళ్లించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. ధాన్యం అక్రమ చర్యల్లో రూ.18.16 లక్షల నగదు రికవరీ చేయగా, మరో రూ.46.21లక్షలు బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేశారు. అరెస్టు అయిన వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. దీంతో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మిల్లులో భద్రంగా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంత జరుగుతున్న కొనరావుపేట మండలం మర్తన్నపేటకు చెందిన ఒక రైస్ మిల్లుకు చెందిన లారీలో ధాన్యం తరలిస్తుండగా సిరిసిల్ల చంద్రపేట వద్ద కొందరు గుర్తించడం లారీ డ్రైవర్ పారిపోవడంతో చర్చగా మారింది. వేబిల్లు లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు విచారించి జరిమానాతో వదిలేసినట్లు తెలిసింది. మిల్లర్లు, పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కుమ్మక్కు కావడంతోనే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బయటపడిన ధాన్యం దారిమళ్లిన సంఘటనలు, ప్రభుత్వానికి అందించాల్సిన సీఎంఆర్ ఇవ్వకపోవడంలో మిల్లర్లపై అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్న తీరు కూడా ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.
మిల్లర్లపై చర్యలు ఏవి?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఏటా కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగించడంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, కనీసం మిల్లర్లపై చర్యలు కూడా తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న రైస్‌మిల్లుల్లో 40కి పైగా డిఫాల్ట్‌గా ఉన్నాయి. జిల్లాలో దాదాపు రూ.90 కోట్లకు పైగా డిఫాల్ట్ మిల్లుల నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉన్న మిల్లర్లపై చర్యలు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇస్తామని హెచ్చరించినా మిల్లర్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. 2025-26లో ఖరీఫ్‌లో 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించి బియ్యం 1.12 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అలాగే యాసంగిలో 3.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా సీఎంఆర్ కింద 1.82 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం. దీంతో పాటు గతంలో డిఫాల్ట్‌గా మారిన మిల్లర్ల నుంచి దాదాపు రూ.90కోట్ల విలువైన బియ్యం రావాల్సి ఉంది. మిల్లర్లు అనేక కారణాలు చూపుతూ అధికారులనే మాయచేస్తూ తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ధాన్యంతో మిల్లర్లు అక్రమంగా దందా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రాజకీయ పెద్దల అండదండలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.