Share News

సీఎంఆర్‌ డెలివరీని వేగవంతం చేయాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:58 PM

వానకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా రైస్‌మిల్లర్లను ఆదేశించారు.

సీఎంఆర్‌ డెలివరీని వేగవంతం చేయాలి
ఆరెపల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా రైస్‌మిల్లర్లను ఆదేశించారు. కలెక్టర్‌ తన ఛాంబర్‌లో రైస్‌మిల్లర్లతో సీఎంఆర్‌ డెలివరీ, ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీ చేసే అంశాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్‌లో మిల్లులకు కేటాయించిన ధాన్యం, ఇప్పటి వరకు పూర్తయిన సీఎంఆర్‌ డెలివరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే వ్యాగన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే బియ్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషన్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి రజనీకాంత్‌, రైస్‌ మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి

కరీంనగర్‌ టౌన్‌: నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాగునీటిని సరఫరా చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఎల్‌ఎండీ సమీపంలోని నగరపాలక సంస్థ ఫిల్టర్‌బెడ్‌ను బుధవారం సందర్శించారు. నగరంలో ప్రస్తుతం తాగునీటి పరిస్థితి, నీటి లభ్యత, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఈఈ లచ్చిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఫ ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి..

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన భూములు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నగరంలోని సప్తగిరికాలనీలో ఎల్‌ఎడీ రిజర్వాయర్‌కు సంబంధించి ముంపునకు గురైన ఎస్సారెస్పీ భూములను కలెక్టర్‌ పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, ఆర్డీవో షర్మిల, కరీంనగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ రాజేశ్‌ కలెక్టర్‌ వెంట ఉన్నారు.

ఫ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు మరమ్మతులు చేయాలి

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ శివారు ఆరెపల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆరెపల్లిలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కలెక్టర్‌ చిత్ర మిశ్రా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు విద్యుత్‌, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Updated Date - Aug 12 , 2026 | 11:58 PM