సిరుల గెలలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:03 AM
ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును పెంచాలని ప్రయత్నాలు చేస్తోంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును పెంచాలని ప్రయత్నాలు చేస్తోంది. కొందరు రైతులకు తొలికాపు అందడంతో రైతులు ఆ సాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలోని నేలల్లో ఆయిల్‌పామ్ మొక్కలు అనుకున్న విధంగా పెరిగి మంచి దిగుబడి వస్తోంది. టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర 23,488 రూపాయలుండగా 537 రూపాయలు పెంచారు. ప్రస్తుతం టన్నుకు 24,025 రూపాయలు చెల్లిస్తున్నారు. మొదటి రెండు సంవత్సరాల్లో సాగైన తోటలు దిగుబడి ఇస్తున్నాయి. ఇప్పటి వరకు 536 ఎకరాల్లో 570 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. వీటి యజమానులైన 140 మంది రైతులకు 1.34 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఆయిల్ కంపెనీలే తోటల పెంపకానికి మొక్కలు సరఫరా చేస్తూ సాగు సలహాలందిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకు నిర్వహణ ఖర్చులు ఇస్తూ బైబాక్ పద్ధతిలో దిగుబడిని కొనుగోలు చేస్తున్నాయి. ఇది లాభదాయకంగా ఉండడంతో రైతులు ఇప్పుడిప్పుడే ఈసాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం మరో వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయించాలని నిర్ణయించుకున్నారు. గెలలను కంపనీలు కొనుగోలు చేస్తూ మంచి ధరను చెల్లిస్తుండడంతో ఈ సాగు లాభసాటిగా మారింది. దీంతో రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఫ రైతులకు అవగాహన
జిల్లాలో 45వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరు సంవత్సరాలుగా రైతులకు ఈ సాగుపై ఉద్యానవనశాఖ ద్వారా, వ్యవసాయశాఖ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నది. సబ్సిడీపై మొక్కలను సరఫరా చేయడంతోపాటు నాలుగు సంవత్సరాల్లో తోటల నిర్వహణకు ఎరువులు, క్రిమిసంహరక మందులకు అవసరమయ్యే డబ్బును కూడా ప్రభుత్వమే సమకూర్చుతున్నది. 2022-23 సంవత్సరంలో 609 ఎకరాల్లో, 2023-24లో 1134 ఎకరాల్లో 2024-25లో 731 ఎకరాల్లో, 2025-26లో 405 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. నాలుగేళ్లలో 2,894 ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టగలిగారు. ఈసారి మరో వెయ్యి ఎకరాల్లో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
ఫ అంతర పంటలతో అదనపు ఆదాయం
ఆయిల్‌పామ్ తోటల్లో అంతరపంటలు వేసే అవకాశాలు అలా సాగు చేసిన వారికి అదనపు ఆదాయం చేకూరనున్నది. జిల్లాలో లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆయిల్‌పామ్ తోటలను పెంచే ఏజెన్సీగా నియమించారు. ఆ సంస్థ పనితీరు ఆశించిన మేరకు ప్రోత్సహకరంగా లేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్‌కు జిల్లా ఆయిల్‌పామ్ తోటల పెంపకం, బైబాక్ పద్ధతిలో గెలలను కొనుగోలు చేసే బాధ్యతను అప్పజెప్పారు. ఆయిల్‌ఫెడ్ సంస్థకు చెందిన ఫ్యాక్టరీ సిద్దిపేటలో ఇటీవల ప్రారంభం కావడంతో రైతులు తాము దిగుబడి సాధించిన గెలలను రవాణా చేసేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం తప్పింది.