Share News

చేపపిల్లల పంపిణీపై నీలినీడలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:49 AM

ఎల్‌ఈనో విపత్తుతో తమ జీవనాధారమైన చేప విత్తన పంపిణీ ఉన్నట్లా.. లేనట్లా అనే సందిగ్ధత మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది.

చేపపిల్లల పంపిణీపై నీలినీడలు

- ఎల్‌నినో విపత్తుతో మత్స్యకారుల్లో ఆందోళన

- ఆరు నెలలు నీరు ఉంటేనే చేప ఎదిగే అవకాశం

- మరోసారి నీటి లెక్కల్లో ప్రభుత్వం

- కొత్త మార్గదర్శకాలతో ఇబ్బందులు

- జిల్లాలో 168 మత్స్య పారిశ్రామిక సంఘాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎల్‌ఈనో విపత్తుతో తమ జీవనాధారమైన చేప విత్తన పంపిణీ ఉన్నట్లా.. లేనట్లా అనే సందిగ్ధత మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు, కుంటలు నీటి నిల్వలు తగ్గిపోతుండగా ప్రధానంగా జిల్లాలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 27.55 టీఎంసీల నీటి నిల్వకు 23.15 టీఎంసీలు ఉన్నా ఇతర ప్రాంతాల అవసరాలకు, ఇతర ప్రాజెక్టులకు నీటిని తరలించే పరిస్థితి ఉంది. దీంతో పాటు రానున్న రోజుల్లో చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ మత్స్య శాఖకు నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా మరోసారి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో నీటి వసతి ఎన్ని నెలలు నిల్వ ఉంటుందో సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం కూడా చేప పిల్లల పంపిణీ చేయాలా.. వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. చేప పిల్ల పంపిణీపై సమగ్ర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని ఆయా శాఖల అధికారుల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. చేపలు కిలో వరకు పెరగాలంటే కనీసం ఆరు నెలల పాటు చెరువులో నీరు ఉండాలని, 50 శాతం చెరువులో నీరు ఉంటేనే చేప పిల్లలు వదిలితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేప పిల్లలను చెరువులో వదిలితే ప్రజాధనం వృథా తప్ప.. మత్స్యకారులకు ప్రయోజనం చేకూరదని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో చేప పిల్లల పెంపకంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చేప పిల్లలను చెరువుల్లో వదలాలంటే ఆయా గ్రామపంచాయతీ నుంచి ఒక తీర్మానం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అలాగే నీటిపాదుల శాఖ అధికారుల నుంచి చెరువులో వచ్చే వేసవి సీజన్‌ వరకు 50 నీటి లభ్యత ఉంటుందని అధికారులు ఒక ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా మత్స్యశాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. విజిలెన్స్‌ అధికారుల పర్యవేక్షణలో చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు చెరువులు నీటి లభ్యత లేకపోవడంతో మత్స్యకారులు ఈసారి ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఉంది.

జిల్లాలో 1.40 కోట్ల చేప పిల్లల పంపిణీ యాక్షన్‌ ప్లాన్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉచిత చేప పిల్లల పథకం ద్వారా 2026-27 సంవత్సరానికి 1.40 కోట్ల చేప పిల్లలను చెరువులు, ప్రాజేక్ట్‌ల్లో వదలడానికి ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. దీనికి అనుగుణంగా టెండర్‌ ప్రక్రియ పూర్తిచేయడమే కాకుండా సీడ్‌ తనిఖీలు కూడా పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా చేపలను వదలడానికి అధికార యంత్రం సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం మత్స్యశాఖ రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం 1.40 కోట్ల చేప పిల్లలను జిల్లాలోని 456 చెరువులు, నాలుగు ప్రాజెక్టుల్లోకి వదిలే లక్ష్యంగా ఉంది. జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్టులోకి 28.50 లక్షలు, నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులోకి 10.50 లక్షలు, అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 1.36 లక్షలు, 456 చెరువుల్లోకి 87.82 లక్షల చేప పిల్లలను వదిలే విధంగా టెండర్‌ ప్రక్రియ సీడ్‌ తనిఖీలు పూర్తిచేసి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి రగ్రీన్‌ సిగ్నల్‌ కోసం చూస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరం 348 చెరువులు, కుంటలు, శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్టు, ఎగువమానేరు ప్రాజెక్ట్‌, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌, మల్కపేట ప్రాజెక్టులో 1.35కోట్ల చేపపిల్లలను వదిలారు. నాలుగు రకాల చేపపిల్లలు ప్రధానంగా బొచ్చె, రవులు, బంగారు తీగ, మేరియా రకాల పిల్లలను వదిలారు

జిల్లాలో మత్స్య సహకార పరిస్థితి ఇది..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉపాధిని అందుకుంటున్నారు. జిల్లాలో మత్స్య శాఖ పరిధిలో 401 చెరువులు ఉన్నాయి. 168మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, 10,156 మంది సభ్యులు ఉన్నారు. 47 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రెండు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు మిడ్‌ మానేరులో చేపలు పట్టడానికి 741 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 251 మంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 52 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీ చేశారు.

చెరువుల్లో చేపపిల్లలు వదిలిన తీరు..

సంవత్సరం చెరువులు/ప్రాజెక్ట్‌లు వదిలినవి

2016- 17 92 30.5 లక్షలు

2017- 18 66 20 లక్షలు

2018- 19 95 57.48లక్షలు

2019- 20 313 100.91 లక్షలు

2020- 21 362 115.61 లక్షలు

2021- 22 392 119.25 లక్షలు

2022 -23 392 138.27 లక్షలు

2023 -24 440 141.00 లక్షలు

2024-25 324 46.71 లక్షలు

2025 -26 348 135.6 లక్షలు

2026-27 456 140.00లక్షలు(యాక్షన్‌ ప్లాన్‌)

Updated Date - Nov 02 , 2026 | 12:49 AM