చేపపిల్లల పంపిణీపై నీలినీడలు..
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:50 AM
ఎల్‌నినో ఎఫెక్ట్ చేప పిల్లల పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చేపపిల్లలు ఒడ్డున పడి విలవిలలాడేలా మత్స్యకారుల పరిస్థితి ఉంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఎల్‌నినో ఎఫెక్ట్ చేప పిల్లల పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చేపపిల్లలు ఒడ్డున పడి విలవిలలాడేలా మత్స్యకారుల పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ రంగంతో పాటు కులవృత్తులపై ఎల్‌నినో ప్రభావం చూపుతోంది. ఉచిత చేపపిల్లల పంపిణీపై కరువు నీడలు కమ్ముకోవడంతో గంగ పుత్రులు, ముదిరాజులలో నిరాశ వ్యక్తమవుతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నా భారీ వర్షాలు లేక ప్రాజెక్టులు, చెరువులు వెలవెలబోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో జిల్లాలో మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందించే దిశగా చేప పిల్లల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తూ ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఈసారి ఉచిత చెపపిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగానే మారింది. సాధారణంగా ప్రతి సంవత్సరం మే, జూన్ మాసాల్లోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈసారి ప్రభుత్వం నుంచి ఉచిత చేప పిల్లల టెండర్ల ప్రక్రియపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో చేప పిల్లల పంపిణీ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత సంవత్సరం వర్షాకాలం సీజన్ రుతు పవనాలు సకాలంలో వచ్చిన ప్రారంభంలో అనుకూలమైన వర్షాలు కురవకపోవడంతో టెండర్ల ప్రక్రియ చేపట్టలేదు. అల్పపీడన ప్రభావంతో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో చెరువులు. ప్రాజెక్టులోకి నీరు చేరి జలకళ సంతరించుకుంది. చేప విత్తనాల పంపిణీ జాప్యంపై మత్స్యకారుల నుంచి వచ్చిన డిమాండ్, నిరసనలతో చివరకు టెండర్లకు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి నవంబర్ మాసంలో చేపపిల్ల పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం 348 చెరువులు, కుంటలు, శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు, ఎగువ మానేరు ప్రాజెక్ట్, అన్నపూర్ణ ప్రాజెక్ట్, మల్కపేట ప్రాజెక్టులో 1.35 కోట్ల చేప పిల్లలను వదిలారు. నాలుగు రకాల చేప పిల్లలు ప్రధానంగా బొచ్చె, రవులు, బంగారు తీగ, మేరియా రకాల పిల్లలను వదిలారు. చేప పిల్లలు సకాలంలో వదలకు పోవడంతో ఎదుగుదలపై ప్రభావం చూపిందని మత్స్యకారులు అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్లు చేప పిల్లలు ఉత్పత్తిలో నిమగ్నం కావాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. మరోవైపు కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రతిసారి టెండర్ల సమయంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం పలుమార్లు టెండర్లకు పిలవాల్సి వస్తోంది. ఈసారి కనీసం టెండర్ల ప్రక్రియ కూడా మొదలుకాని పరిస్థితి నెలకొంది.
చేప పిల్లల ఎదుగుదలపై ప్రభావం
వర్షాకాలం ఆరంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులోకి నీరు చేరడంతోనే ఉచిత చేప పిల్లలు వదిలితే ఉత్పత్తి పెరుగుతుందని మత్స్యకారులు అంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చేప పిల్లలు వేస్తే ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చేపలు కిలో వరకు సైజు పెరగాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. జూలై, ఆగస్టు మాసాల్లో చెపపిల్లలను వదిలితేనే విక్రయించే అవకాశాలు ఉంటాయని మత్స్యకారులు చెప్తున్నారు.
వెలవెలబోతున్న ప్రాజెక్టులు, చెరువులు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఇప్పటికి భారీ వర్షాలు కురవలేదు. మోస్తారు వర్షాలతో సగటు వర్షపాతం కూడా ఇప్పటివరకు దాటలేదు. జిల్లాలో 34.0 శాతం లోటు వర్షపాతమే ఉంది జిల్లాలో ఇప్పటివరకు 273.0 మిల్లీమీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 181.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గత సంవత్సరం ఈ సమయానికి 5204.7మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతంలో రుద్రంగి మండలంలో 49 శాతం వర్షపాతం ఉండగా, చందుర్తిలో 30 శాతం, వేములవాడరూరల్ 36 శాతం, బోయిన్‌పల్లిలో 40 శాతం, వేములవాడలో 25 శాతం, సిరిసిల్లలో 44 శాతం, కోనరావుపేటలో 18 శాతం, వీర్నపల్లిలో 17 శాతం ఎల్లారెడ్డిపేటలో 32 శాతం, గంభీరావుపేట 25 శాతం, ముస్తాబాద్‌లో 27 శాతం, తంగళ్ళపల్లిలో 45శాతం, ఇల్లంతకుంటలో 47 శాతం లోటు వర్షపాతం ఉంది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టులో 27.55 టీఎంసీల సామర్థ్యాన్నిగాను 7.43టీఎంసీలు నీటి నిల్వ ఉంది, అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.50 టీఎంసీల సామర్ధ్యానికి 1.45 టీఎంసీలు, ఎగువ మానేరులో 2 టీఎంసీలకు 0.612 టీఎంసీలు, మల్కపేట పాజెక్ట్‌లో 3 టీఎంసీలకు 1.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జిల్లాలో మత్స్య సహకార పరిస్థితి ఇది..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉపాధిని అందుకుంటున్నారు. జిల్లాలో మత్స్య శాఖ పరిధిలో 401 చెరువులు ఉన్నాయి. 168 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, 9220 మంది సభ్యులు ఉన్నారు. 48 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రెండు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. గత అర్థిక సంవత్సరం వరకు మిడ్ మానేరులో చేపలు పట్టడానికి 741 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 251 మంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 52 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీ చేశారు.
చేపపిల్లలు చెరువుల్లో వదిలిన తీరు
సంవత్సరం చెరువులు /కుంటలు వదిలినవి
2016- 17 92 30.5 లక్షలు
2017- 18 66 20 లక్షలు
2018- 19 95 57.48లక్షలు
2019- 20 313 100.91 లక్షలు
2020- 21 362 115.61 లక్షలు
2021- 22 392 119.25 లక్షలు
2022 -23 392 138.27 లక్షలు
2023 -24 440 141.00 లక్షలు
2024-25 324 46.71 లక్షలు
2025 -26 348 135.6 లక్షలు