ఇసుక అక్రమ రవాణా కోసం కల్వర్టు పైపుల మూసివేత
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:42 PM
మండలంలోని చొక్కారావుపల్లి శివారులోని బిక్క వాగు నుంచి ఇల్లంతకుంట మండలానికి చెందిన కొందరు ఇసుకను శనివారం అక్రమంగా తరలిస్తుంచారు.
గన్నేరువరం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చొక్కారావుపల్లి శివారులోని బిక్క వాగు నుంచి ఇల్లంతకుంట మండలానికి చెందిన కొందరు ఇసుకను శనివారం అక్రమంగా తరలిస్తుంచారు. వారిని చొక్కారావుపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలానికి చెందిన కొందరు వ్యక్తులు బిక్కవాగు కల్వర్టుకు చెందిన 25 పైపులను మట్టితో నింపి వాగులో నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేశారన్నారు. చొక్కారావుపల్లి పరిధిలోని ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక దందా సాగిస్తున్నారని విమర్శించారు. కల్వర్టు మూసివేతతో నీరు రాక వాగుని ఆనుకొని ఉన్న బోర్లు, వ్యవసాయ బావులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇల్లంతకుంట, గన్నేరువరం పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు పైపులను మూసి వేస్తూ మట్టిని పోసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు, చొక్కారావుపల్లి సర్పంచ్ అరుకొంతం గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బిక్కవాగు వద్దకు చేరుకుని కల్వర్టు పైపులకు అడ్డంగా పోసిన మట్టిని ఎక్స్‌కావేటర్‌తో తీసి వేయించారు.