స్వచ్ఛ పాఠశాల
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:21 AM
భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వరుసగా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులతో నగరంలోని చైతన్యపురి కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
- నేటి నుంచి వరుసగా కార్యక్రమాలు
- విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు
- కార్యకర్తలతో హోం మంత్రి బండి సంజయ్‌కుమార్ సమావేశం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి కరీంనగర్)
భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వరుసగా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులతో నగరంలోని చైతన్యపురి కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించారు. స్వచ్ఛ పాఠశాల పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోన్ని అన్నిగ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లోన్నింటిని శుభ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న స్వచ్ఛ పాఠశాల పేరుతో ఆయా పాఠశాలలను పరిశుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం మండలాల వారీగా పార్టీ కార్యకర్తలంతా సమావేశమై పాఠశాల వారీగా ఇన్‌చార్జీలను నియమించాలన్నారు. 11, 12 తేదీల్లో భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో టిఫిన్ బైఠక్ పేరుతో సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలల్లో ఎన్ని తరగతి గదులుంటాయో, ఒక్కో గదికి ఇద్దరు చొప్పున కార్యకర్తలను కేటాయించాలన్నారు. 13న అన్ని పాఠశాలల్లో తరగతి గదులను శుభ్రం చేయించాలన్నారు. అవసరమైన సామగ్రిని వెంట తీసుకు వెళ్లాలన్నారు. ప్రతి పాఠశాలను శుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేయాలని సూచించారు. 16న ప్రతి గ్రామంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే నినాదంతో ఊరూవాడా ర్యాలీలు నిర్వహించాలన్నారు.
ఫ సైకిళ్ల పంపిణీతో గిన్నిస్ రికార్డు సృష్టించే యోచన
ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో బ్రాండెడ్ సైకిల్‌ను అందజేయాలని నిర్ణయించామని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుకునే ప్రతి విద్యార్థికి బ్రాండెడ్ సైకిల్ అందిస్తామని చెప్పాలన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ఒకేసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు పంపిణి చేసి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో నమోదయ్యేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశ ప్రధానిగా 12 ఏళ్ల పాలనను ముగించుకున్న సందర్భంగా బుధవారం నగరంలో మహాశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జిల్లాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.